Cheteshwar Pujara: 73 బంతుల్లోనే పుజారా సెంచరీ.. ఒకే ఓవర్లో 22 పరుగులు!

టీమ్‌ఇండియా టెస్ట్‌ స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ ఛెతేశ్వర్‌ పుజారా సరికొత్త బ్యాటింగ్‌తో వినోదాన్ని అందించాడు

Updated : 18 Aug 2022 14:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్ట్‌ ఛెతేశ్వర్‌ పుజారా బ్యాటింగ్‌ శైలి అందరికీ తెలిసిందే. క్రీజులో కుదురుకోవడానికి చాలా సమయం తీసుకుంటూ.. ఒక్కోసారి బౌలర్లను విసిగిస్తుంటాడు. అలాంటి పుజారా తాజాగా జరిగిన ఓ వన్డేలో మెరుపు ఇన్నింగ్‌ ఆడి ఆశ్చర్యానికి గురి చేశాడు. రాయల్‌ లండన్‌ వన్డే కప్‌లో సస్సెక్స్ జట్టు తరఫున ఆడుతూ అదరగొట్టాడు. శుక్రవారం వార్విక్‌షైర్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 79 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. విశేషమేమిటంటే పుజారా ఒకే ఓవర్లో 22 పరుగులు బాదాడు. ఈ మ్యాచ్‌లో సస్సెక్స్ 311 పరుగుల లక్ష్య ఛేదనలో 112 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో పుజారా 22వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆరంభం నుంచి ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

ఇక యామ్ నార్వెల్ వేసిన 45వ ఓవర్‌లో పుజారా చెలరేగిపోయాడు. అప్పటికే 59 బంతుల్లో 66 పరుగులతో క్రీజ్‌లో ఉన్న అతడు.. ఆ ఓవర్లో వరుసగా 4,2,4,2,6,4 బాదాడు. దీంతో 88 పరుగులకు చేరుకొన్నాడు. ఇక ఇన్నింగ్స్ 48వ ఓవర్‌లో తన సెంచరీ సాధించాడు. 49వ ఓవర్లో హన్నాన్-డాల్బీ చేతిలో క్లీన్ బౌల్డ్ కావడంతో అతడి పోరాటం ముగిసింది. ఆ తర్వతా సస్సెక్స్ బ్యాటర్లను బౌలర్లు కట్టడిచేయడంతో నాలుగు పరుగుల తేడాతో వార్విక్‌షైర్‌ విజయం సాధించింది. సస్సెక్స్ రెగ్యులర్ కెప్టెన్ టామ్ హైన్స్ గాయం కారణంగా దూరమవ్వడంతో ఈ మ్యాచ్‌లో పుజారానే కెప్టెన్సీ చేశాడు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు