Skyscrapers: ప్రపంచంలో నేలమట్టమైన ఆకాశహర్మ్యాలు ఇవే..!

ప్రపంచంలోనే ఎత్తైన భవనాల్లో ఒకటైన వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ఉగ్రవాదుల చేతిలో కుప్పకూలగా.. వివిధ కారణాల వల్ల నేలమట్టమైన ఆకాశహర్మ్యాల్లో కొన్నింటిపై ఓసారి లుక్కేద్దాం.

Updated : 15 Nov 2022 16:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో అతి ఎత్తయిన భవనాల్లో ఒకటైన నోయిడా జంట టవర్లు (Noida Twin Towers) సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎట్టకేలకు నేలమట్టమయ్యాయి. వంద మీటర్ల ఎత్తయిన భవంతులను కూల్చివేసే ఘటనను యావత్‌ దేశం ఆసక్తిగా గమనించింది. ఇంత పెద్ద భవంతులను కూల్చివేయడం ఇక్కడ ఇదే తొలిసారి. కానీ, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఇటువంటి భారీ భవంతులను కూల్చివేసిన ఘటనలు అనేకం. ప్రపంచంలోనే ఎత్తయిన భవనాల్లో ఒకటైన వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ (World Trade Centre) ఉగ్రవాదుల చేతిలో కుప్పకూలగా.. వివిధ కారణాల వల్ల నేలమట్టమైన ఆకాశహర్మ్యాల్లో కొన్నింటిపై ఓసారి లుక్కేద్దాం.

వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ (World Trade Centre)

సెప్టెంబర్‌ 11, 2001న ప్రపంచ వాణిజ్య కేంద్రం (World Trade Center)కు చెందిన ట్విన్‌ టవర్స్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదులు విమానాలను హైజాక్‌ చేసి దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో జంట భవనాలు మొత్తం కుప్పకూలిపోయాయి. నాటి మారణహోమంలో 2,753మంది న్యూయార్క్‌ పౌరులు మరణించగా.. సుమారు 25వేల మందికి పైగా గాయపడ్డారు.

డాయిష్‌బ్యాంక్‌ బిల్డింగ్‌ (Deutsche Bank Building)

అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ఈ 39 అంతస్థుల బ్యాంకు భవనాన్ని 2007-2011 మధ్య కాలంలో కూల్చివేశారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ఎదురుగా ఉంటుంది. 2001లో ఉగ్రదాదుల దాడిలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ కుప్పకూలిన సందర్భంగా ఈ బిల్డింగ్‌ కూడా దెబ్బతింది. దీంతో ఈ భవంతిని కూల్చివేయాలని నిర్ణయించిన అధికారులు.. ఆ ఘటన జరిగిన దశాబ్దం కాలం తర్వాత పూర్తిచేశారు.

270 పార్క్‌ లేన్‌ (270 PARK AVENUE)

న్యూయార్క్‌ నగరానికి దగ్గర్లోని మాన్‌హట్టన్‌ టౌన్‌లోని పార్క్‌ లేన్‌ భవనాన్ని 1961లో నిర్మించారు. అమెరికాలోని ప్రముఖ బ్యాంక్‌ జేపీ మోర్గాన్‌ కేంద్రం ఈ భవనంలోనే కొనసాగింది. 215 మీటర్ల ఎత్తయిన ఈ భవంతిని కూల్చివేసి అదేచోట కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. 2021లో దీని కూల్చివేత పూర్తయ్యింది.

సింగర్‌ బిల్డింగ్‌ (Singer Building)

అమెరికాలోని న్యూయార్క్‌లో సింగర్‌ బిల్డింగ్‌ ఉండేది. 1960 దశకంలో న్యూయార్క్‌ నగరంలోనే అతి ఎత్తయిన భవనం అది. అంతేకాదు, అంతకుముందు ప్రపంచంలో అత్యంత ఎత్తయిన భవంతిగానూ (41 ఫోర్లు) రికార్డు నమోదు చేసుకుంది. అయితే, పాత కట్టడం కావడంతో దీనిని 1969లో నేలమట్టం చేశారు.

మారిసన్‌ హోటల్‌ (Morrison Hotel)

అమెరికా షికాగోలోని మారిసన్‌ హోటల్‌ను 1965లో కూల్చివేశారు. 160 మీటర్ల ఎత్తయిన ఆ భవనం ప్రపంచంలోనే భారీ భవంతుల్లో ఒకటిగా ఉండేది. అంతేకాకుండా ఈ స్థాయి భారీ భవనాన్ని కూల్చివేయడం కూడా ప్రపంచంలో అదే తొలిసారి కావడం గమనార్హం. అనంతరం ఇదే ప్రాంతంలో 259 మీటర్ల ఎత్తులో 60 అంతస్థుల (Chase Tower) భారీ భవనాన్ని నిర్మించారు. 1969లో ఈ నూతన భవన నిర్మాణం పూర్తయ్యింది.

యూఐసీ బిల్డింగ్‌ (UIC Building)

సింగపూర్‌లోని యునైటెడ్‌ ఇండస్ట్రియల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ బిల్డింగ్‌ నిర్మాణం 1973లో పూర్తయ్యింది. అప్పట్లో ఆగ్నేయాసిలోనే అతిపెద్ద భవనాల్లో ఒకటిగా నిలిచింది. 40 అంతస్థుల ఆ భవనాన్ని 2013లో కూల్చివేశారు.

ఆక్సా టవర్‌ (AXA Tower)

సింగపూర్‌లో అత్యంత ఎత్తయిన భవనాల్లో ఆక్సా టవర్‌ కూడా ఒకటి. దాని ఎత్తు 234.7 మీటర్లు. అయితే, దీన్ని కూల్చివేసేందుకు ఇటీవలే నిర్ణయించారు. దీంతో మే 2022 నుంచి మూసివేశారు. అదే ప్రాంతంలో 305 మీటర్లు (1001 అడగుల) ఎత్తయిన భారీ ఆకాశహర్మ్యాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. సింగపూర్‌లోనే 171 మీటర్ల ఎత్తయిన సీపీఎఫ్‌ భవనాన్ని 2017లో నేలమట్టం చేశారు. వీటితోపాటు సింగపూర్‌లోనే మరో భారీ భవనం ఫ్యుజీ జిరాక్స్‌ టవర్స్‌ (165 మీటర్లు)ను 1987లో నిర్మించగా.. ప్రస్తుతం కూల్చివేసే దశలో ఉంది.

మినా ప్లాజా (Mina Plaza)

అబుదాబీలోని అత్యంత ఎత్తయిన భవన సముదాయం మినా ప్లాజా. దీన్ని నాలుగు టవర్లుగా నిర్మించారు. మొత్తం 2,46,000చ.మీ విస్తీర్ణంలో 144 అంతస్థుల్లో నిర్మించిన ఈ భవనం ఎత్తు 541 అడుగులు. దీన్ని కొన్ని సెకన్ల వ్యవధిలోనే కూల్చివేశారు. షాపింగ్‌ కేంద్రంగా పేరుపొందిన ఈ ప్రదేశంలో మరో భారీ కట్టడాన్ని నిర్మించే ప్రణాళికలోనే నేలకూల్చారు. ఇలా కారణాలు ఏమైనా ప్రపంచంలోనే ఎత్తైన ఆకాశహర్మ్యాలుగా పేరుగాంచిన వాటిని నేలమట్టం చేసిన ఘటనలు ఉన్నాయి.

నోయిడా ట్విన్‌ టవర్లు కూలాయిలా...



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని