Stock Market: సెన్సెక్స్‌కు 500 పాయింట్ల నష్టం.. 16,900 దిగువన నిఫ్టీ

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి...

Published : 28 Sep 2022 09:38 IST

ముంబయి: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్ని చవిచూశాయి. రేట్ల పెంపుపై ఫెడ్‌ కఠినంగా వ్యవహరించనున్నట్లు ఉద్ఘాటించడమే పతనానికి ప్రధాన కారణం. ఈరోజు ఉదయం మిశ్రమంగా ట్రేడింగ్‌ను ప్రారంభించిన ఆసియా మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. రేట్ల పెంపు ఫలితంగా మాంద్యం, ద్రవ్యోల్బణం ఇంకా అధిక స్థాయిల్లో ఉండడం మార్కెట్లను కలవరపెడుతున్నాయి. మరోవైపు ప్రపంచం మాంద్యం అంచున ఉందంటూ డబ్ల్యూటీఓ అధిపతి చేసిన హెచ్చరికలు మార్కెట్ల సెంటిమెంటును పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే పలు సంస్థలు భారత్‌ సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటును కుదించాయి.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:25 గంటల సమయానికి సెన్సెక్స్‌ 483 పాయింట్లు నష్టపోయి 56,624 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 142 పాయింట్లు కోల్పోయి 16,865 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత పతనమై రూ.81.89 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, పవర్‌గ్రిడ్‌, ఎంఅండ్ఎం షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, రిలయన్స్‌, టాటా స్టీల్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

నేడు గమనించాల్సిన స్టాక్స్‌...

మహీంద్రా సీఐఈ ఆటోమోటివ్‌: మహీంద్రా అండ్‌ మహీంద్రా తమ అనుబంధ సంస్థ మహీంద్రా సీఐఈ ఆటోమోటివ్‌లో 2.173 శాతం వాటాలను విక్రయించింది.

బీహెచ్‌ఈఎల్‌: ఈ కంపెనీకి ఎన్‌టీపీసీ నుంచి 2x660 మెగావాట్‌ తాల్చేర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ స్టేజ్‌-III ఆర్డర్‌ దక్కింది.

ఐఎఫ్‌సీఐ: వచ్చే ఆర్థిక సంవత్సరానికిగానూ భారత ప్రభుత్వానికి రూ.100 కోట్లు విలువ చేసే ప్రిఫరెన్షియల్‌ షేర్లను జారీ చేయాలని ఐఎఫ్‌సీఐ బోర్డు నిర్ణయించింది. దీనికి ఇంకా వాటాదారుల అనుమతి రావాల్సి ఉంది.

బీపీసీఎల్‌: బహిరంగ విపణి లావాదేవీల ద్వారా బీపీసీఎల్‌లో ఎల్‌ఐసీ 2.01 శాతం అదనపు వాటాలను సొంతం చేసుకుంది.

టొరెంట్‌ ఫార్మా: చర్మ సంబంధ చికిత్సా విభాగంలో తమ ఉనికిని బలోపేతం చేసుకునేందుకు క్యురేషియో హెల్త్‌కేర్‌ను రూ.2,000 కోట్లతో కొనుగోలు చేయబోతున్నట్లు టొరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ మంగళవారం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు