LIC పాల‌సీదారుల‌కు శుభ‌వార్త‌.. ల్యాప్స్ అయిన పాల‌సీల‌ పున‌రుద్ధ‌రణకు అవకాశం

LIC policy: ఆల‌స్య‌పు రుసుము రాయితీతో పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణకు అవ‌కాశం ఇస్తున్న‌ట్లు ఎల్ఐసీ ప్రకటించింది.

Published : 13 Aug 2022 14:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ అతి పెద్ద జీవిత‌ బీమా సంస్థ‌ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC).. త‌మ పాల‌సీదార్ల‌కు శుభ‌వార్త తెలిపింది. ర‌ద్దయిన పాలసీలను పునరుద్ధరించాలనుకునే వారికి.. ప్రత్యేక అవకాశాన్ని ఇస్తున్న‌ట్లు ప్రకటించింది. అయితే ఇది వ్య‌క్తిగ‌త పాల‌సీల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. ఈ ఆఫ‌ర్‌లో భాగంగా అన్ని యులిప్‌-యేత‌ర పాల‌సీల‌ను ఆల‌స్య రుముసు చెల్లించి పున‌రుద్ధరించుకోవ‌చ్చు. ఆల‌స్య రుసుములో రాయితీ కూడా అందిస్తుంది. ఈ ఆఫ‌ర్ ఆగ‌ష్టు 17 నుంచి అక్టోబ‌రు 21 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది.

ఆర్థిక ఇబ్బందులు లేదా అనివార్య‌ పరిస్థితుల కారణంగా ప్రీమియంలు స‌కాలంలో చెల్లించ‌క‌ పాల‌సీ ర‌ద్దు అయివుంటే.. అటువంటి పాల‌సీదార్ల‌కు స‌హాయ‌ప‌డేందుకు ఈ ఆప్ష‌న్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎల్ఐసీ తెలిపింది. ‘జీవిత బీమా క‌వ‌ర్, న‌ష్ట‌భ‌య నిర్వ‌హ‌ణ కోసం ఉద్దేశించిన‌ది. అనుకోకుండా ప్రాణ న‌ష్టం జ‌రిగిన‌ప్పుడు పాల‌సీదారుని కుటుంబానికి ఆర్థికంగా అండ‌గా ఉంటుంది. అందువ‌ల్ల పాల‌సీదార్లు తమ ర‌ద్దు అయిన పాల‌సీల‌ను పున‌రుద్ధ‌రించుకునేందుకు, కుటుంబ ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుకునేందుకు, బీమా ప్ర‌యోజ‌నాల‌ను కొన‌సాగించేంద‌కు ఇది అరుదైన అవ‌కాశం’’ అని ఎల్ఐసీ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. పాల‌సీ నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి ప్రీమియం చెల్లించని రోజు నుంచి 5 సంవ‌త్స‌రాల‌లోపు పాల‌సీల‌ను పునరుద్ధ‌రించ‌వ‌చ్చు.

ఆల‌స్య రుసుము రాయితీ వివ‌రాలు..

  • పాల‌సీ కోసం చెల్లించాల్సిన ప్రీమియం రూ.1 ల‌క్ష లోపు ఉంటే.. ఆల‌స్య‌పు రుసుములో 25 శాతం.. గ‌రిష్ఠంగా రూ.2500 రాయితీతో పున‌రుద్ధరించుకునేందుకు అనుమతిస్తారు.
  • పాల‌సీ కోసం చెల్లించాల్సిన ప్రీమియం రూ. 1 ల‌క్ష పైన రూ.3 ల‌క్ష‌లలోపు ఉంటే.. ఆల‌స్య‌పు రుసుములో 25 శాతం.. గ‌రిష్ఠంగా రూ.3000 రాయితీతో పున‌రుద్ధరించుకునేందుకు అనుమతిస్తారు.
  • పాల‌సీ కోసం చెల్లించాల్సిన ప్రీమియం రూ. 3లక్షలకు పైన ఉంటే.. ఆల‌స్య‌పు రుసుములో 30 శాతం.. గ‌రిష్ఠంగా రూ.3500 రాయితీతో పున‌రుద్ధరించుకునేందుకు అనుమతిస్తారు.
  •  ఇన్సురెన్స్ పాల‌సీల‌ను 100 శాతం ఆల‌స్య రుసుము ర‌ద్దుతో పున‌రుద్ధ‌రించుకునేందుకు అనుమ‌తిస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని