IT Notice: ఐటీ నోటీసులు అందాయా? ముందు లోపమేంటో గుర్తించండి!

ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు అనగానే చాలా మంది హడలెత్తిపోతుంటారు. కానీ, అన్ని సందర్భాల్లో భయపడాల్సిన అవసరం లేదు....

Updated : 28 Sep 2022 11:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు అనగానే చాలా మంది హడలెత్తిపోతుంటారు. కానీ, అన్ని సందర్భాల్లో భయపడాల్సిన అవసరం లేదు. ఐటీ నోటీసు అంటే మీ ఐటీ పత్రాల్లో సమస్య ఉందని తెలియజేస్తూ పంపే రాతపూర్వక సమాచారం మాత్రమే. దీనికి ఒక్కోసారి మీరు తిరిగి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కోసారి అవసరం ఉండదు. కేవలం సమస్య ఉందని తెలియజేసి మరోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని హెచ్చరిస్తుంటారు. అందుకే పన్ను చెల్లింపుదారులు నోటీసు అందగానే దాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. తర్వాతే సమాధానం ఇవ్వాలి. అవసరమైతే ఈ విషయంలో నిపుణుల సలహా తీసుకోవాలి.

నోటీసు వర్సెస్‌ సమాచారం..

ఆదాయ పన్ను విభాగం పంపే ప్రతిదీ నోటీసుగానే పరిగణించాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి కేవలం సమస్య ఉందని తెలియజేసి భవిష్యత్తులో దాన్ని పునరావృతం కాకుండా చూసుకోమని ‘ఇంటిమేషన్‌’ కూడా పంపుతుంటారు. దీనిపై ఐటీ విభాగం ఎలాంటి చర్యలు తీసుకోదు. కానీ, నోటీసు మాత్రం దీనికి భిన్నం. మీ ఐటీ పత్రాల్లో గుర్తించిన సమస్య చట్టపరమైన చర్యలకు దారితీయొచ్చు. దీనికి పన్ను చెల్లింపుదారులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో వారు సంతృప్తి చెందకపోతే.. విచారణ చేపట్టి తగు సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటారు.

ఐటీ విభాగం ఏయే సెక్షన్ల కింద నోటీసులు అందజేస్తుంది? వాటి అర్థం ఏంటో చూద్దాం..

సెక్షన్‌ 139(9): ఐటీ రిటర్నుల్లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అధికారులు గుర్తిస్తే ఈ సెక్షన్‌ కింద నోటీసు జారీ చేస్తారు. దీనికి పన్ను చెల్లింపుదారులు ఆధారాలతో సహా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. లేదా నోటీసు అందిన 15 రోజుల్లోగా తప్పును సరిద్దుకోవాలి.

సెక్షన్‌ 143(1): మీరు ఇంకా ఏదైనా పన్ను బకాయి ఉంటే వెంటనే చెల్లించమని చెబుతూ నోటీసు అందజేస్తారు. 30 రోజుల్లోగా బకాయి చెల్లించాల్సి ఉంటుంది.

సెక్షన్‌ 143(2), సెక్షన్‌ 143(3): ఒకవేళ మీ ఐటీ రిటర్నులను పరిశీలన లేదా సమీక్షకు ఎంపిక చేసినట్లయితే.. సెక్షన్‌ 143 (2) కింద నోటీసు జారీ చేస్తారు. అప్పుడు పన్ను చెల్లింపులుదారులు వారి రిటర్నుల్లో పేర్కొన్న సమాచారానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. అన్నింటినీ పరిశీలించిన తర్వాత సెక్షన్‌ 143(3) కింద పూర్తిస్థాయి సమీక్షను ప్రారంభిస్తున్నట్లు స్టేట్‌మెంట్‌ను పంపిస్తారు. ఈ దశలో మీరు సమర్పించిన ఆధారాలు, రిటర్నుల్లో ఇచ్చిన సమాచారం సరిగ్గా ఉన్నాయా.. లేదా.. లోతుగా చెక్‌ చేస్తారు. సెక్షన్‌ 143(1), సెక్షన్‌ 143(2), సెక్షన్‌ 143(3) కింద నోటీసులు అందిన 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఏమైనా సర్దుబాట్లు ఉంటే వాటిని ఐటీ అధికారులు తదుపరి సంవత్సరానికి బదలాయిస్తారు.

సెక్షన్‌ 245: క్రితం ఏడాది పన్ను చెల్లింపు డిమాండ్‌లు ఏమైనా బకాయి ఉంటే.. వాటిని ఈ ఏడాది రిఫండ్‌ నుంచి సర్దుబాటు చేస్తున్నట్లు తెలియజేస్తూ ఐటీ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. అందుకు మీరు సమ్మతిస్తున్నారా లేదా తెలియజేస్తూ 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

నోటీసు ఎందుకు పంపారు?

తొలుత అసలు నోటీసు ఎందుకు పంపారో పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాలి. నోటీసులు పంపడానికి చాలా కారణాలుంటాయి. ఐటీఆర్‌ దాఖలు చేయకపోయినా; వాస్తవం కంటే తక్కువ ఆదాయం చూపినప్పుడు; ఏఐఎస్‌ (యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌-AIS)తో రిటర్నుల సమాచారం సరిపోలకపోవడం.. వంటి సందర్భాల్లో నోటీసులు అందే అవకాశం ఉంది. ఎక్కవ మొత్తం మినహాయింపు కోరినా, ఏదైనా పన్ను ప్రయోజనం కోరినప్పుడు దానికి తగిన ఆధారాలు సమర్పించకపోయినా.. నోటీసులు జారీ చేస్తారు. ఒక్కోసారి పన్ను ఎగవేతను అరికట్టడానికి కూడా నోటీసులు ఇస్తుంటారు. జీవిత భాగస్వామి పేరిట చేసిన పెట్టుబడులపై వచ్చే ఆదాయాన్ని కూడా కచ్చితంగా రిటర్నుల్లో పేర్కొనాల్సి ఉంటుంది. లేదంటే నోటీసులు అందుతాయి.

ఎలా వివరణ ఇవ్వాలి?

నోటీసు అందగానే దాంట్లో పేర్కొన్న శాశ్వత ఖాతా సంఖ్య (PAN), పేరు, ఇతర వివరాలు మీకు సంబంధించినవేనా సరి చూసుకోవాలి. తర్వాత నోటీసు మొత్తాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఏవైనా లోపాలున్నట్లు గుర్తిస్తే దానికి అనుగుణంగా సమాధానం ఇవ్వాలి. కావాల్సిన ఆధారాలు పంపాలి. అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవాలి. సకాలంలో స్పందించడం కూడా చాలా ముఖ్యం. లేదంటే ఏవైనా బకాయిలుంటే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఐటీ అధికారులు వారి దగ్గర ఉన్న సమాచారంతో వారి విచక్షణ మేరకు సర్దుబాట్లు చేసే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని