Stock Market: ఆరంభ నష్టాల నుంచి కోలుకున్న సూచీలు

దేశీయ మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో నేటి ట్రేడింగ్‌ను నష్టాలతో మొదలుపెట్టిన సూచీలు.. చాలా సేపు ఊగిసలాడాయి. అయితే

Published : 28 Jun 2022 15:58 IST

ముంబయి: దేశీయ మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో నేటి ట్రేడింగ్‌ను నష్టాలతో మొదలుపెట్టిన సూచీలు.. చాలా సేపు ఊగిసలాడాయి. అయితే మధ్యాహ్నం తర్వాత మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఆరంభ నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు.. చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. ఈ వారంలో డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు.

అమ్మకాల ఒత్తిడితో ఈ ఉదయం సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా నష్టంతో 52,846.26 వద్ద మొదలైంది. ఒక దశలో 52,771.53 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి, 53,301.40 వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయిని నమోదుచేసింది. ఆద్యంతం ఒడుదొడుకుల్లోనే సాగిన సూచీ..  చివరకు 16.17 పాయింట్ల అత్యల్ప లాభంతో 53,177.45 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 15,710.15 - 15,892.10 పాయింట్ల మధ్య కదలాడింది. మార్కెట్ ముగిసే సమయానికి 18.15 పాయింట్ల లాభంతో 15,850.20 వద్ద స్థిరపడింది.

నిఫ్టీలో ఓఎన్‌జీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, కోల్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు రాణించగా.. టైటాన్‌ కంపెనీ, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, దివిస్‌ ల్యాబ్స్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఆటో, లోహ, చమురు రంగ సూచీలు 1-2 శాతం మేర పెరగగా.. ఆర్థిక రంగ షేర్లు కుంగాయి.

జీవనకాల కనిష్ఠానికి రూపాయి..

అటు రూపాయి విలువ కూడా అంతకంతకూ క్షీణిస్తోంది. నేటి ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 44 పైసలు పతనమై 78.81 వద్ద సరికొత్త జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది. సమీప కాలంలో డాలరు విలువ రూ.80 వరకు వెళ్లొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని