కథనాలు


నేడు నువ్వే ఒక సైన్యం..!
ప్రతి సైనికుడూ.. నేనొక్కడినీ పోరాడకుండా ఉంటే ఏమౌతుంది.. అనుకుంటే మన పరిస్థితేంటి?
ఓటు కూడా అంతే! అందుకే నేనొక్కడిని ఓటు వేయకుంటే ఏమౌతుందిలే అనే ధోరణిని వదిలించుకుందాం.
నేను ఒక్కడిని ఓటేస్తే సమాజం మారిపోతుందా?
అని కొందరు వితండవాదం చేస్తుంటారు. ఓటు వేసిన వాళ్లు ప్రశ్నిస్తేనే.. ప్రజాప్రతినిధులు పట్టించుకోని పరిస్థితి. అలాంటిది.. అసలా హక్కు వినియోగించుకోనప్పుడు నేతల్ని నిలదీసే అవకాశం, అధికారం ఉండదనే విషయాన్ని గుర్తించాలి. కాబట్టి అడిగే హక్కు ఉండాలంటే.. ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే.

ప్రభుత్వాలు నాకేం చేశాయని నేను ఓటెయ్యాలి?
ప్రభుత్వాలు నాకేం చేస్తున్నాయి? ఎవరు పాలించినా సమస్యలు మాత్రం పోవుకదా? ఈ తరహా చర్చలతో సమాజం మారిపోతుందా? సమస్యలు తీరుతాయా? ప్రభుత్వాలకే కాదు.. ప్రజలకూ కొన్ని విధులు, బాధ్యతలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రధానమైనదే ఓటు హక్కు వినియోగించుకోవడం. ఓటు వేయాల్సిన ధర్మం పాటించకుండా ప్రభుత్వ ఫలాలు మన ఇంట్లోకి అడుగుపెట్టాలనుకోవడం స్వార్థమే కదా..? బాధ్యత నిర్వర్తించనప్పుడు బాధలు తీర్చాలంటూ నిలదీసే అవకాశం ఎక్కడుంటుంది?.. ఇవి ఎవరికి వాళ్లు వేసుకోవాల్సిన ప్రశ్నలు.

వీరిని స్ఫూర్తిగా తీసుకుందాం..!
* ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లోని తండాల గిరిజనులు ఓటు వేయడానికి 10 నుంచి 20 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి ఓటేసి వస్తుంటారు.
* గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన జనం ఓటును ప్రాణంగా భావిస్తారు. ఓటు వేయకుంటే మరణించినట్లు పరిగణిస్తారు. కచ్చితంగా ఓటేసి తీరుతారు.
* మరి కేవలం.. 100 నుంచి 500 మీటర్ల దూరంలోగల పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేసేందుకు మనకెందుకు అలసత్వం.. పదండి వడివడిగా..!

ఓటు నీ హక్కు.. నేడు మీట నొక్కు
రాజకీయ హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా భారీ పోరాటాలు
త్యాగాల ఫలితంగానే ఓటు హక్కు
భారత్‌లో తొలి నుంచి ఇది అందరికీ సమానమే...
1890 నాటికి ఈ భూగోళంపై ఓటు హక్కున్న దేశం ఒక్కటైనా లేదు. అలాంటిది ఇప్పుడు  మెత్తం 192 దేశాలకు గాను 124 దేశాల్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. 

18 ఏళ్లు నిండితే చాలు. నేడు మన దేశంలో ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు దక్కుతోంది. కుల మత లింగ వివక్షలేం లేవు. ఆస్తులు, అంతస్తుల భేదాలేం లేవు. భారత పౌరులందరికీ సరిసమానంగా దక్కుతున్న అపూర్వమైన హక్కు ఇది. అయితే దీనికి పెద్ద చరిత్రే ఉంది. అందరికీ ఆయాచితంగా వచ్చిన వరమేం కాదిది. దీని కోసం ప్రపంచంలో దేశదేశానా ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఉద్యమించి, రక్తం చిందించి మరీ సాధించుకున్న ‘అధికారం’ ఇది! 
అమెరికాలో అంచెలంచెలుగా...
అగ్రరాజ్యం అమెరికాకు 1776లో స్వాతంత్య్రం సిద్ధించినా.. మహిళలు, నల్లజాతీయులకు మాత్రం రాజకీయ, పౌర హక్కులు దఖలు పడలేదు. దీంతో వీటి కోసం ఉద్ధృతంగా పోరాటాలు సాగాయి. జాతి, లింగ వివక్ష రహితంగా ప్రజలందరికీ సమానంగా ఓటు హక్కు లభించడానికి రమారమి 150 ఏళ్లు పట్టింది! 1870లో 15వ రాజ్యాంగ సవరణ ద్వారా బానిసేతర నల్లజాతి పురుషులకు ఓటు హక్కు కల్పించారు. కానీ, తెల్లజాతి మహిళలకు, మిగతా నల్లజాతివారికి ఈ హక్కు దరిచేరలేదు. 1920లో మరో రాజ్యాంగ సవరణ ద్వారా తెల్లజాతి మహిళలకు ఓటు హక్కు కల్పించారు. ఆ తర్వాత నాలుగేళ్లకు ప్రజలందరికీ సమానంగా దీన్ని అందించారు.

మహిళలకు మొదటిసారిగా..
బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం పొందిన తొమ్మిదేళ్ల తర్వాతగాని ఆస్ట్రేలియాలోని మహిళలకు ఓటు హక్కు లభించలేదు! పౌర హక్కుల కోసం వారు నెరపిన ఉద్యమాలకు ప్రభుత్వం దిగొచ్చింది. 1902లో తొలిసారిగా వారికి ఓటు హక్కును కల్పించింది. అక్కడితో అయిపోలేదు. ఆంగ్లేయుల రాకకు ముందే ఆయా దీవుల్లో చెదిరిపోయిన ఆదివాసీలను రాజకీయంగా విస్మరించడం మరిన్ని పోరాటాలకు ఆజ్యం పోసింది. చివరికి వీరిక్కూడా 1962లో ఓటు హక్కు లభించింది.

అప్పటి నుంచే పోటీలోకి..
ప్రపంచంలోనే తొలిసారిగా 1906లో మహిళలకు ఓటు హక్కుతోపాటు... చట్టసభకు పోటీచేసే హక్కును కూడా ఒకేసారి ప్రసాదించింది ఫిన్‌లాండ్‌. మొదట్లో మాత్రం ఇక్కడ పురుషులకే ఓటు హక్కు ఉండేది.

పన్ను కడితేనే ఓటు..
డెన్మార్క్‌లో పరిస్థితి మరీ విచిత్రం! 1886 వరకూ ఇక్కడి మహిళలకు ఓటు హక్కు లేదు. ఆ తర్వాత కూడా... రాజధాని కోపెన్‌హాగన్‌లో నివసిస్తూ, పన్ను చెల్లింపుదారులైన మహిళలకే ఈ హక్కును కల్పించారు. ఈ అసమానతలను రూపుమాపాలంటూ ఉద్యమాలు ఉద్ధృతమవడంతో... ఎట్టకేలకు 1915లో అందిరికీ సమానంగా ఓటు హక్కు దక్కింది.

ఆడవారికి హక్కు ఇచ్చిన ఆఖరి దేశం..
సౌదీ అరేబియాలో 2011 వరకూ పురుషులకు మాత్రమే ఓటు హక్కుండేది. తమకూ ఆ హక్కును కల్పించాలంటూ స్థానిక మహిళా సంఘాలు పోరాటాలు చేపట్టాయి. వీటికి ప్రపంచ స్థాయి సంస్థలు, ఉద్యమకారులు మద్దతు పలకడంతో, ఎట్టకేలకు వారి ఆకాంక్షలు నెరవేరాయి. 21వ శతాబ్దంలో తాజాగా మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశంగా సౌదీ చరిత్ర పుటలకెక్కింది.

ఉక్కు పాలకులూ చిత్తయ్యారు..
ప్రజాస్వామ్య ప్రభుత్వాలు జనానికి జవాబుదారీ. పాలకులు తమను విస్మరించి... సొంత లాభానికి పెద్దపీట వేసినప్పుడల్లా ప్రజలు ఓటుతో వారిపై వేటు వేస్తూనే ఉన్నారు. సుపరిపాలన అందించిన వారికి మళ్లీ మళ్లీ అందలం ఎక్కిస్తూనే ఉన్నారు.

* ఫిలిప్పీన్స్‌లో అవినీతి మార్కోస్‌ నియంతృత్వాన్ని ప్రజలు ఉద్యమించి అంతమొందించారు. 1980ల్లో ఈ పరిణామాన్ని ప్రజాశక్తికి నిదర్శనంగా చెప్పుకొనేవారు. 

* ఒకప్పుడు బ్రిటన్‌ ఉక్కు మహిళగా, శక్తిమంతమైన వ్యక్తిగా ఖ్యాతిగాంచారు... ప్రధాని మార్గరేట్‌ థాచర్‌! కానీ, ఆమెకూ ప్రజల చేతిలో వాతలు తప్పలేదు! పేద, మధ్యతరగతి జనాన్ని విస్మరించి, సంపన్నుల సంక్షేమానికి పెద్దపీట వేసినందుకు జనం ఆమెను చిత్తుగా ఓడించారు. 

* దక్షిణాఫ్రికాలో శతాబ్దాల వర్ణ వివక్షను ప్రజా ఉద్యమం అంతమొందించింది. మండేలాకు నీరాజనం పలికింది. నేపాల్‌లోనైతే అద్భుతమే ఆవిష్కృతమైంది. దశాబ్దాల పాటు రక్తపాతం సృష్టించిన మావోయిస్టులు... సమోన్నత ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామయ్యారు. అధికారమూ చేజిక్కించుకున్నారు!

- ఈనాడు ఎన్నికల విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

ఎన్నికల షెడ్యూల్

ఛత్తీస్‌గఢ్ నవంబరు 12 , 20
మధ్యప్రదేశ్‌ నవంబరు 28
మిజోరం నవంబరు 28
తెలంగాణ డిసెంబరు 7
రాజస్థాన్ డిసెంబరు 7
ఓట్ల లెక్కింపు డిసెంబరు 11

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.