కథనాలు

కొత్త కొత్తగా
ఎన్నికల్లో సరికొత్త అంశాలు
అందుబాటులోకి సాంకేతిక పరిజ్ఞానం
ఈ ఎన్నికల్లో ఎన్ని మార్పులో.. ఎంత వైవిధ్యమో..!
రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ సారి ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. అందరినీ పోలింగ్‌కు రప్పించేలా...మరింత సౌకర్యవంతంగా ఉండేలా పలు వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టింది. ఎన్నో కొంగొత్త అంశాలను జోడించింది.
బ్యాలెట్‌ పత్రాలపై ఫొటోలు
ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై ఉండే బ్యాలెట్‌ పత్రాల్లో అభ్యర్థుల పేర్లు, ఇంటి పేర్లు, గుర్తులు మాత్రమే ఉండేవి. అవి ఒకే విధంగా ఉండటంతో క్రాస్‌ ఓటింగ్‌ పెరిగి విజయావకాశాలు తారుమారవుతాయని పలు పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ సారి బ్యాలెట్‌ పత్రాల్లో అభ్యర్థుల పేర్లు, గుర్తుల పక్కనే అభ్యర్థుల ఫొటోలను  కొత్తగా ముద్రించింది.
ఓటరు చీటీల్లో పూర్తి సమాచారం
అధికారులు గతంలో పంపిణీ చేసే పోలింగ్‌ చీటీల్లో కేవలం ఓటర్ల పేర్లు, తండ్రి/భర్త పేరు, ఇంటి సంఖ్య, గ్రామం తదితర వివరాలు మాత్రమే ఉండేవి. ఈ సారి ఓటరు చీటీలు కొత్త రూపు సంతరించుకున్నాయి. వాటిలో గూగుల్‌ ఎర్త్‌ సహకారంతో పోలింగ్‌ కేంద్రాల చిరునామాను రూట్‌ మ్యాప్‌తో సహా ముద్రించారు. ఓటర్ల అనుమానాల నివృత్తికి బూత్‌స్థాయి అధికారుల  సెల్‌ నంబర్లను, జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్‌, టోల్‌ఫ్రీ నంబర్లనూ ముద్రించారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌నూ పేర్కొన్నారు.
మహిళలకు ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు
మహిళల పోలింగ్‌ శాతం తగ్గుతుందని గుర్తించిన ఎన్నికల సంఘం ఈ సారి కొత్తగా పింక్‌ పోలింగ్‌ కేంద్రాల పేరిట ప్రత్యేకంగా మహిళా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీటిలో  మహిళా ఉద్యోగులే విధులు నిర్వర్తిస్తారు.
దివ్యాంగులకు సదుపాయాలు
వరుసలో ఎక్కువ సమయం నిలబడలేక దివ్యాంగులు ఓటు హక్కుకు దూరమవుతున్నారు. దీంతో వారు ఓటు హక్కును వినియోగించడానికి వీలుగా ఎన్నికల సంఘం ప్రత్యేక సదుపాయాలను కల్పించింది. గ్రామంలో 70 మంది దివ్యాంగులు ఉంటే వారికి ప్రత్యేక వాహనాన్ని కేటాయించింది. దివ్యాంగులను ఈ వాహనాల్లో పోలింగ్‌ కేంద్రం ఆవరణ వరకు తీసుకెళతారు. ఆవరణ నుంచి పోలింగ్‌ గదిలోకి వెళ్లడానికిగాను చక్రాల కుర్చీలు, ట్రై సైకిళ్లను ఏర్పాటు చేశారు. 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకూ ఈ సదుపాయాలు వర్తిస్తాయి.
ఓటు నమోదుపై అవగాహన
అర్హులైన యువకులను ఓటర్లుగా నమోదు చేయడానికి ఎన్నికల సంఘం ఈ సారి పలు వినూత్న విధానాలను అనుసరించింది. ప్రధానంగా యువకులు సెల్ఫీలు దిగడానికి ప్రాధాన్యమిస్తారు. యువకులను ఆకర్షించడానికి పట్టణ ప్రాంతాల్లో ‘ఐ ఓట్‌ బికాజ్‌..’ పేరిట పట్టణాల్లో సెల్ఫీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఓటర్లకు చైతన్యం పెంపొందించేలా హోర్డింగులను ఏర్పాటు చేసి గాలి బెలూన్లను ఏర్పాటు చేసింది. వీటితోపాటు ఓటు హక్కును వినియోగించాలంటూ ఈ సారి కళాబృందాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేపట్టింది.
అంధుల కోసం బ్రెయిలీ లిపి
ప్రతి ఎన్నికల్లో అంధులు ఓటు హక్కును వినియోగించుకోవడం ఇబ్బందికరంగా మారింది. చాలా మంది అంధులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం అంధుల కోసం ఈవీఎంలలో బ్రెయిలీ లిపీని అందుబాటులోకి తీసుకొచ్చింది. వీరికి బెయిలీ లిపితో కూడిన ఓటరు చీటీలను పంపిణీ చేశారు.
రెండు ఓట్లను గుర్తించొచ్చు
రెండు చోట్ల ఉన్న ఓట్లను తొలగించి ఏదైనా ఒకే ప్రాంతంలో ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఎన్నికల సంఘం ‘ఈఆర్వోనెట్‌.వీ2.0 వర్షన్‌’ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికల సంఘం అధికారులు ఈ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా ఓటర్ల రెండో ఓటును తొలగించారు.
ఫిర్యాదులకు సి-విజిల్‌
అభ్యర్థులు పంపిణీ చేస్తున్న డబ్బు, మద్యం గురించి గతంలో సంబంధిత కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి ఉండేది. వీటిపై ఓటర్లు ఫిర్యాదు చేస్తూ మద్యం, డబ్బు పంపిణీని అరికట్టడానికి ప్రస్తుతం ఎన్నికల సంఘం సీ- విజిల్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్న వ్యక్తుల చిత్రాలు తీసి ఈ యాప్‌లో నమోదు చేయగానే.. సంబంధిత అధికారులకు సమాచారం అందుతుంది. ఈ ఎన్నికల్లో  కొత్తగా ప్రవేశపెట్టిన యాప్‌కు ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చింది.
సందేహాల నివృత్తికి ‘సమాధాన్‌’..
ఎన్నికల సమయంలో ఓటర్లు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి గతంలో అధికారులు, ఆర్డీవో, జిల్లా పాలనాధికారి కార్యాలయాల వద్దకు వెళ్లాల్సి వచ్చేంది. ఈ సారి ఓటర్లు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వీలుగా ‘సమాధాన్‌’ యాప్‌ను ప్రవేశపెట్టింది. స్మార్ట్‌ చరవాణిలో ‘సమాధాన్‌’ యాప్‌ను దిగుమతి చేసుకొని ఆ యాప్‌ ద్వారా సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు.
నూతన రాష్ట్రంలో తొలి ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ 2014లో కేంద్రం ప్రకటన చేసింది. అయితే 2014లో జరిగిన ఎన్నికలు మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే ఏప్రిల్‌ 30న జరిగాయి. అదే సంవత్సరం జూన్‌ 2న ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న తొలి శాసన సభ ఎన్నికలు మాత్రం ఇవే.

చిన్న జిల్లాల్లో  మొదటిసారిగా..
2016లో ఏర్పాటైన చిన్న జిల్లాల్లో జరుగుతున్న తొలి ఎన్నికలు కూడా ఇవే.. కాలపరిమితి ముగియడంతో తొలుత పంచాయతీ  ఎన్నికలు జరుగుతాయని భావించినా అవి వాయిదా పడ్డాయి. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత శాసనసభకు జరగనున్న ఎన్నికలే తొలి ఎన్నికలుగా గుర్తింపు పొందనున్నాయి.

కొత్త పార్టీలు, కూటముల ఆవిర్భావం
తెలంగాణ సాధన కోసం ఏర్పాటు చేసిన ఐక్య కార్యచరణ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించిన ఆచార్య కోదండరాం నేతృత్వంలో తెజస ఆవిర్భవించగా తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌  ఏర్పాటు జరిగింది.

నిన్నటి శత్రువులు..నేటి మిత్రులు
రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం ఉండవన్న అంశాన్ని నిజం చేస్తూ ఈ సారి ప్రజా కూటమి పేరిట  కాంగ్రెస్‌, తెదేపాలు ఒకే గొడుగు కిందకు చేరాయి. తెలుగుదేశం పార్టీ గతంలో వివిధ సందర్భాల్లో తెరాస, భాజపాలతో జట్టు కట్టినప్పటికీ  కాంగ్రెస్‌కు స్నేహ ‘హస్తం’ చాచడం ఆసక్తి కరంగా మారింది.

- ఈనాడు- మహబూబ్‌నగర్‌ డెస్క్‌, న్యూస్‌టుడే లక్సెట్టిపేట

మరిన్ని

జిల్లా వార్తలు

ఎన్నికల షెడ్యూల్

ఛత్తీస్‌గఢ్ నవంబరు 12 , 20
మధ్యప్రదేశ్‌ నవంబరు 28
మిజోరం నవంబరు 28
తెలంగాణ డిసెంబరు 7
రాజస్థాన్ డిసెంబరు 7
ఓట్ల లెక్కింపు డిసెంబరు 11

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.