పోటీలో ప్రముఖులు



ఈటలకు క్రికెటర్‌ సవాల్‌
ఓటర్ల ఆశీస్సుల కోసం పోటాపోటీగా ప్రచారం
ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌
కారు జోరు కొనసాగనుందా? హస్తం హవా చాటనుందా..? తెరాసకు అభివృద్ధి నినాదం అండగా నిలవనుందా? హమీల అండ కాంగ్రెస్‌కు లభించనుందా? అనే ప్రశ్నల నడుమ కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ రాజకీయం రక్తికడుతోంది. హోరాహోరి పోరుతో రాష్ట్ర వ్యాప్త దృష్టిని ఆకర్షిస్తోంది. వరుస విజయాలతో ముందుకు వెళ్తున్న రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌, క్రికెట్‌ మైదానం నుంచి రాజకీయ మైదానంలోకి అడుగిడిన క్రికెటర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల సమరం ఆసక్తిని రేకెత్తిస్తోంది. భాజపా అభ్యర్థి పుప్పాల రఘు తనదైన శైలిలో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ప్రధాన పోటీ మాత్రం తెరాస, కాంగ్రెస్‌ల మధ్యే ఉంది. ప్రధాన పార్టీల ముఖ్యనేతలు తమ అభ్యర్థుల విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
మరో గెలుపు కోసం తెరాస
హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి వరుసగా నెగ్గుతున్న తెరాస అభ్యర్థి, మంత్రి ఈటల రాజేందర్‌ మరోమారు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. కమలాపురం శాసనసభ స్థానం నుంచి 2004, 2008 ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల, నియోజకవర్గం హుజూరాబాద్‌గా మారిన తర్వాత కూడా వరుసగా నెగ్గుతున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గం అభివృద్దే తనను గెలిపిస్తుందని  ఈటల విశ్వాసంతో ఉన్నారు.  ఆరో విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు నుంచే ఆయన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు. కుల సంఘాలతోపాటు అన్ని వర్గాల ప్రజలతో సమావేశాల్ని నిర్వహిస్తూ  ఓట్లు సాధించేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. తెరాసలోని కొంతమంది కార్పొరేటర్లు, ముఖ్యనాయకులు పార్టీని వీడటం కొంత సమస్యగా భావించినా అదే సమయంలో కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు ఈటల పక్షానికి చేరడంతో సమస్యలేకుండా పోయింది.

విజయం వరించేలా కాంగ్రెస్‌
మొట్టమొదటి సారిగా ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. స్వతహాగా క్రికెటరైన కౌశిక్‌రెడ్డి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన కొంతకాలం నుంచి కాంగ్రెస్‌లో చురుగ్గా ఉంటున్నారు. టికెట్‌ తనకే వస్తుందన్న విశ్వాసంతో ముందునుంచే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. పార్టీ బలంతోపాటు తనకున్న పరిచయాల అండతో ముందుకు వెళ్తున్నారు. కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి తోడ్పాటు లభిస్తోంది. నియోజకవర్గంపై పూర్తిగా దృష్టి సారించి పట్టు సాధించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో పాటు నియోజకవర్గంలో ఏళ్లతరబడి ఒకే నాయకుడు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారనే  భావన కాంగ్రెస్‌ గెలుపునకు దోహదపడతాయన్న విశ్వాసంతో విజయం కోసం శ్రమిస్తున్నారు. తెరాస హయాంలో నెరవేరని హామీలను ప్రజలకు వివరిస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కౌశిక్‌రెడ్డి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

పాడి కౌశిక్‌రెడ్డి  (కాంగ్రెస్‌)

ఈటల రాజేందర్‌ (తెరాస)

మరిన్ని

జిల్లా వార్తలు

ఎన్నికల షెడ్యూల్

ఛత్తీస్‌గఢ్ నవంబరు 12 , 20
మధ్యప్రదేశ్‌ నవంబరు 28
మిజోరం నవంబరు 28
తెలంగాణ డిసెంబరు 7
రాజస్థాన్ డిసెంబరు 7
ఓట్ల లెక్కింపు డిసెంబరు 11

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.