పోటీలో ప్రముఖులు



సికింద్రా బాద్‌షా ఎవరో..?

సంక్షేమంపై పద్మారావు నమ్మకం
పట్టు కోసం కాసాని ప్రయత్నం
భాజపా నుంచి బరిలో బండేపల్లి సతీష్‌
ఈనాడు, సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
న్నత చదువుల నిలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం.. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం.. తదితర కీలక కేంద్రాల సమాహారమైన సికింద్రాబాద్‌.. ఇద్దరు సీనియర్‌ బీసీ నేతల మధ్య ఆసక్తికర పోరుకు వేదికైంది. తెరాస నుంచి మంత్రి టి.పద్మారావు, మహాకూటమిలోని కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ మధ్య పోటీ ఉత్కంఠ భరితంగా జరగనుంది. భాజపా నుంచి బండేపల్లి సతీష్‌ పోటీలో ఉన్నా.. ప్రధాన పోటీ తెరాస, కాంగ్రెస్‌ల మధ్యే నెలకొందని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 29 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ఆరుసార్లు కాంగ్రెస్‌, నాలుగు దఫాలు తెలుగుదేశం, రెండు సార్లు తెరాస అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కార్పొరేటర్‌గా పని చేసిన టి.పద్మారావు 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస నుంచి పోటీ చేసి తొలిసారి గెలుపొందారు. 2014లో తిరిగి మళ్లీ ఎన్నికయ్యారు.

‘సీఎంఆర్‌ఎఫ్‌ మంత్రి’
గడిచిన నాలుగున్నరేళ్లుగా పద్మారావు సికింద్రాబాద్‌లో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు వైద్య సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి సుమారు రూ.20 కోట్లు విడుదల చేయించి ‘సీఎంఆర్‌ఫ్‌ మంత్రి’గా గుర్తింపు పొందారు. షాదీ ముబారక్‌, కల్యాణ లక్ష్మీ కింద వేలాది మంది లబ్ధిదారులకు సాయం చేయించారు. ఆరువేలున్న సంక్షేమ పింఛన్లను 15 వేలకు పెంచగలిగారు. అయితే, అభివృద్ధి పనుల విషయంలో పూర్తి విజయం సాధించలేకపోయారన్న విమర్శ ఉంది. సీతాఫల్‌మండి, లాలాపేట రోడ్ల విస్తరణ జరగకపోవడంతో వేలాది మంది వాహనదారులు తీవ్రమైన ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిలకలగూడ మార్కెట్‌కు అంకురార్పణ జరగలేదు. ఈ నియోజకవర్గ పరిధిలోని కొన్ని మురికివాడలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత తీసుకున్నా.. అవి పూర్తిస్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. ఈ ఎన్నికల్లో మురికివాడలు, మైనార్టీ ఓటర్లపై పద్మారావు దృష్టిసారించారు.

అనూహ్యంగా బరిలోకి కాసాని
కాంగ్రెస్‌ అధిష్ఠానం ముదిరాజ్‌ మహాసభ నేత కాసాని జ్ఞానేశ్వర్‌కు అనూహ్యంగా సికింద్రాబాద్‌ టికెట్‌ కేటాయించింది. ఎమ్మెల్సీగా పని చేసిన జ్ఞానేశ్వర్‌ ఇక్కడి నుంచి శాసనసభకు పోటీ చేయడం ఇదే తొలిసారి. సికింద్రాబాద్‌ ప్రాంతంలోనే ముదిరాజ్‌ భవన్‌ను నిర్మించి ఈ వర్గం వారికి చాలా కాలంగా అండగా నిలుస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ చివరి దశలో ఆయనకు టికెట్‌ లభించినా.. క్యాడర్‌ను విస్తృతం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే, కాంగ్రెస్‌లోని కొంత మంది ఆయనకు పూర్తి సహకారం అందించడం లేదనే విమర్శలున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

బలం పెంచుకునే ప్రయత్నం
భాజపా అభ్యర్థిగా పోటీకి దిగిన బండేపల్లి సతీష్‌ ఈ నియోజకవర్గానికి కొత్త. క్యాడర్‌ను తయారు చేసుకుని బూత్‌ స్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేసే పనిలో ఆయన ఉన్నారు. తన పేరు అందరి దృష్టికి వెళ్లేలా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. మొత్తంమీద ప్రధాన పార్టీల ముగ్గురు అభ్యర్థులు ఆర్థికంగా బలవంతులు కావడంతో ఇక్కడ ఎన్నికలు కాస్త ‘ఖరీదైన వ్యవహారమేనని’ చెబుతున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

ఎన్నికల షెడ్యూల్

ఛత్తీస్‌గఢ్ నవంబరు 12 , 20
మధ్యప్రదేశ్‌ నవంబరు 28
మిజోరం నవంబరు 28
తెలంగాణ డిసెంబరు 7
రాజస్థాన్ డిసెంబరు 7
ఓట్ల లెక్కింపు డిసెంబరు 11

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.