పరకాల..
ఎవరిదో వరమాల?
కొండా
సురేఖ, ధర్మారెడ్డి మధ్యే పోరు
ఒకరిది
అభివృద్ధి మంత్రం
మరొకరిది
గెలుపు పంతం
ఈనాడు
- వరంగల్
ఉమ్మడి
వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గం
ప్రజలు ఈ దఫా ఎవరికి పట్టం కడతారోనన్న
విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇక్కడి నుంచి గత మూడు దఫాలుగా
వరుసగా కాంగ్రెస్, తెరాస, తెదేపా
అభ్యర్థులు ఒక్కోసారి విజయం
సాధించారు. కొండా సురేఖ గత ఎన్నికల్లో
వరంగల్ తూర్పు నియోజకవర్గం
నుంచి తెరాస తరఫున పోటీచేసి
విజయం సాధించారు. ఈ దఫా టికెట్
దక్కకపోవడంతో ఆ పార్టీ అధినాయకత్వంపై
పదునైన విమర్శలు చేసి కాంగ్రెస్
గూటికి చేరారు. ఎట్టిపరిస్థితుల్లోను
తెరాసను ఓడించి సత్తా చాటాలని
పట్టుదలతో ఉన్నారు. 2014లో పరకాలలో
తెదేపా నుంచి గెలిచిన చల్లా
ధర్మారెడ్డి ఈ సారి తెరాస నుంచి
గెలుస్తానన్న గట్టి నమ్మకంతో
ప్రచారం చేస్తున్నారు.
పరకాల
నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో
కొండా సురేఖ కాంగ్రెస్ నుంచి
పోటీ చేసి గెలుపొందారు. అనంతర
పరిణామాల్లో కాంగ్రెస్‌కు
రాజీనామా చేసి వైకాపాలో చేరారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా
చేసి 2012 ఉప ఎన్నికల్లో వైకాపా
తరఫున పోటీకి దిగారు. అయితే
ఆ ఎన్నికల్లో సురేఖపై తెరాస
అభ్యర్థి మొలుగూరి భిక్షపతి
విజయం సాధించారు. అనంతరం 2014 సాధారణ
ఎన్నికల్లో పరకాలలో తెదేపా
తరఫున పోటీచేసిన చల్లా ధర్మారెడ్డికి
నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టారు.
అనంతరం ఆయన తెరాసకు మద్దతిచ్చారు.
తాజా ఎన్నికల్లో కొండా సురేఖ
కాంగ్రెస్ నుంచి, ధర్మారెడ్డి
తెరాస నుంచి బరిలో నిలవడంతో
ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
*
మొన్నటి వరకు ఒకే పార్టీలో పక్క
పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా
ఉన్న ధర్మారెడ్డి, కొండా సురేఖ
ఇప్పుడు పరకాలలో ప్రత్యర్థులుగా
తలపడనున్నారు. గీసుకొండ-సంగెం
మండలాల్లో ఏర్పాటైన కాకతీయ
మెగా టెక్స్టైల్ పార్కు కోసం
సుమారు 1200 ఎకరాల భూసేకరణలో చల్లా
కీలక పాత్ర పోషించారు. అయితే
అది ఏడాదిలో పూర్తవుతుందనుకున్నా
ఇంకా పూర్తిస్థాయిలో పనులు
మొదలుకాలేదు.
*
కొండా సురేఖ సొంతూరు గీసుకొండ
మండలం వంచనగిరి గ్రామం. ఇది
పరకాల నియోజకవర్గమే. సొంత నియోజకవర్గంలో
కొండా దంపతులకు పట్టుంది. గత
ఎన్నికల్లో వరంగల్ తూర్పు
నుంచి పోటీ చేయడంతో సొంత నియోజకవర్గానికి
దూరమయ్యారు. వీరి సామాజిక వర్గానికి
చెందిన ఓట్లు నియోజకవర్గంలో
ఎక్కువగా ఉండడం కలిసొచ్చే అంశం.
జోరుగా
ప్రచారం
ఆర్థికంగా
బలంగా ఉన్న చల్లా ఎలాగైనా విజయం
సాధించి తీరాలనే పట్టుదలతో
ఉన్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి
కడియంతో కలిసి జోరుగా ప్రచారం
చేస్తున్నారు. ఈ నియోజకవర్గంపై
తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్
కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు
సమాచారం. పరకాలలో చేసిన అభివృద్ధిని
ప్రజల కళ్లకు కట్టి, వారి ఆశీర్వాదం
పొందాలని చల్లా ముందుకెళుతున్నారు.
కాంగ్రెస్‌లో ఉన్న వర్గాలపై
కన్నేసి నాయకులను తమవైపు తిప్పుకుని
చేరికలను కొనసాగిస్తున్నారు.
*
పరకాల స్థానాన్ని కైవసం చేసుకుంటేనే
రాజకీయ భవిష్యత్తు ఉందని భావించిన
కొండా దంపతులు తెరాస నుంచి భారీగా
వలసలను ప్రోత్సహిస్తున్నారు.
ఫైర్‌బ్రాండ్‌గా పేరుపొందిన
సురేఖకు ముఖ్యంగా గీసుకొండ,
ఆత్మకూరు, పరకాల మండలాల్లో మంచి
పట్టు ఉండడంతో అక్కడి శ్రేణులను
మొత్తం తమవైపు తిప్పుకునేందుకు
వేగంగా పావులు కదుపుతున్నారు.
*
గతంలో పోటీ చేసిన అనుభవమున్న
వైద్యుడు డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డికి
భాజపా టికెట్ ఇచ్చింది. ఆయన
తనదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు.
ప్రధాన పోటీ మాత్రం తెరాస, కాంగ్రెస్‌ల
మధ్యే ఉండనుంది.