పోటీలో ప్రముఖులు

పాలేరు...ఎవరు ఏలేరు?

అభివృద్ధిపై  తెరాస ఆశలు
కాంగ్రెస్‌ పునర్‌వైభవం ఊసులు
ఈనాడు - ఖమ్మం
కప్పుడు తమకు కంచుకోటలాంటి పాలేరు నియోజకవర్గంలో పూర్వవైభవం సాధించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతుంటే మునుపెన్నడూ లేనివిధంగా కేవలం రెండేళ్ళ కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని తెలంగాణ రాష్ట్ర సమితి ధీమాతో ఉంది. వెరసి ఖమ్మం జిల్లా పాలేరు ఎన్నిక రసవత్తరంగా మారింది. పలు దఫాలు మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు తెరాస నుంచి పోటీపడుతుండగా మొదటిసారి ఎన్నికల్లోకి దిగిన గుత్తేదారు ఉపేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి ఢీకొడుతున్నారు. కాంగ్రెస్‌ శాసనసభ్యుడు రామిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక మరణంతో జరిగిన ఉపఎన్నికలో తెరాస మొదటిసారి భారీ మెజారిటీతో ఇక్కడ పాగా వేసింది. రెండేళ్ళలో అభివృద్ధి ఫలాలను ప్రజలకు రుచి చూపించామని ఆ పార్టీ  చెబుతోంది. ప్రధానంగా భక్తరామదాసు ఎత్తిపోతల పథకం తెరాస హయాంలో పూర్తయింది. దీనివల్ల సుమారు 66 చెరువులను నింపడంతో వర్షాధారిత పంటలకే పరిమితమైన తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో వరి సాగు జోరందుకుంది. పాలేరు పాతకాలువను ఆధునికీకరించడంతో 16 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. మిషన్‌ భగీరథ ద్వారా 107 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. 130 తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించారు. ఈ అభివృద్ధి పనులనే తెరాస తమ ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది. మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తామని, సీతారామ ఎత్తిపోతల పథకం కూడా పూర్తి చేసి గోదావరి జలాలను నియోజకవర్గంలో పారిస్తానని తుమ్మల హామీ ఇస్తున్నారు. అయితే గతంలో ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన రామిరెడ్డి వెంకటరెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సంబాని చంద్రశేఖరరావు, బాజీ హనుమంతు వంటివారు ప్రజలతో మమేకమై వారిలో ఒకరిగా కలిసిపోయేవారు. అభివృద్ధిపనుల్లో దూకుడు చూపిస్తున్నప్పటికీ ప్రజలకు దగ్గరగా ఉండే విషయంలో తుమ్మల
నాగేశ్వరరావును వారితో పోల్చుకోలేకపోతున్నామని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అభివృద్ధి ప్రచారానికి ఇదొక ఆటంకంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలో దిగిన కందాల ఉపేందర్‌రెడ్డి తెరాస అభ్యర్థి తుమ్మలకు గట్టిపోటీ ఇస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నించారు. స్థానికుడు కావడం ఆయనకు కలసివచ్చే అంశం. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగ్గా 10 సార్లు ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ గెలిచింది. అంతటి బలమైన పునాదులు ఉన్నప్పటికీ 2016లో జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ శ్రేణులు చాలావరకు తెరాసలో చేరాయి. ఇప్పుడు పాత కార్యకర్తలను ఆకర్షించడానికి ఉపేందర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. పునరేకీకరణలో కొంతవరకు సఫలమవుతున్నారు. కూసుమంచి మండలంలో తెరాస బలంగానే ఉన్నప్పటికీ ఉపేందర్‌రెడ్డి ఇదే మండలానికి చెందిన వ్యక్తి కావడంతో కాంగ్రెస్‌ పరిస్థితి కొంత మెరుగైంది. ఖర్చుకు వెనుకాడకుండా, తుమ్మలకు పోటీగా ఆయన విస్తృత ప్రచారంతో ముందుకెళుతున్నారు. తనకు అవకాశం కల్పిస్తే ప్రజల్లో ఒకడిగా కలిసిపోతానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళతానని హామీ ఇస్తున్నారు. వామపక్షాలకు ప్రాబల్యం ఉన్న నేలకొండపల్లి, ఖమ్మం రూరల్‌ మండలాల్లో ఓటింగ్‌ సరళి కూడా ఫలితంపై ప్రభావం చూపనుంది. భాజపా అభ్యర్థిగా కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, సీపీఎం అభ్యర్థిగా బత్తుల హైమవతి, న్యూడెమోక్రసీ (రాయల వర్గం) అభ్యర్థిగా గుర్రం అచ్చయ్య ఎన్నికల బరిలో నిలిచారు.

అభివృద్ధి ఫలాలు పొందిన వారు అండగా ఉండాలి
కరవుపీడిత ప్రాంతం తిరుమలాయపాలెం మండలం. బీడు భూముల్లో సాగునీరు పారించాలని భక్త రామదాసు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టాం. కేవలం 8 నెలల కాలంలోనే పథకాన్ని పూర్తి చేశాం. వేసవికాలంలోనూ చెరువులు, బావులు నీటితో కళకళలాడటంతో పాటు 70 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. పాలేరు నియోజకవర్గంలోని 130 తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించాం. నిజాంకాలం నాటి పాలేరు పాతకాలువను ఆధునికీకరించాం. కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పొందుతున్న ప్రజానీకం ఆయనకు అండగా ఉండాలి. అప్పుడే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతాయి.
- తెరాస అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
బలాలు
* భక్త రామదాసు ఎత్తిపోతల పథకం పూర్తిచేయడం.
* పాలేరు పాతకాలువ ఆధునికీకరణ
* పలువాగులపై చెక్‌డ్యాంలతో కూడిన వంతెనల నిర్మాణం
* అభివృద్ధి, సంక్షేమంపై తక్షణ స్పందన
* ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో తెరాసలో చేరిన శ్రేణులు

బలహీనతలు
* ప్రజలతో మమేకం కాకపోవడం
* ముక్కుసూటిగా మాట్లాడటం

మీలో ఒకడిగా ఉంటా..మీ పనులు చేసి పెడతా
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలి. నన్ను గెలిపిస్తే మీకు అందుబాటులో ఉంటా. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. వచ్చే పక్షం రోజులు మీరే నిలబడినట్లు పని చేయండి. నన్ను గెలిపించండి. వచ్చే ఐదేళ్లు మీ పనులు నేను చేసి పెడతా. ఎవరైనా.. ఎప్పుడైనా నన్ను కలవవచ్చు. మాట్లాడవచ్చు. మీలో ఒకడిగా నేనుంటా. పాలేరు నియోజకవర్గానికి రాష్ట్రవ్యాప్తంగా పేరు వచ్చేలా పని చేస్తా. పదవీకాలంలో ఏ తప్పూ చేయను. ఎమ్మెల్యే పదవికి ఎలాంటి మచ్చ తీసుకురాను.
- కాంగ్రెస్‌ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి
బలాలు..
* అంగబలం, అర్థబలం
* కాంగ్రెస్‌ అనగానే ఆకర్షితులయ్యే తండా ప్రజలు
* సంప్రదాయ కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు

బలహీనతలు
* టికెట్‌ ప్రకటన ఆలస్యం కావడం
* మండలాల్లో నాయకత్వ లోపం
* సమన్వయ లేమి

మరిన్ని

జిల్లా వార్తలు

ఎన్నికల షెడ్యూల్

ఛత్తీస్‌గఢ్ నవంబరు 12 , 20
మధ్యప్రదేశ్‌ నవంబరు 28
మిజోరం నవంబరు 28
తెలంగాణ డిసెంబరు 7
రాజస్థాన్ డిసెంబరు 7
ఓట్ల లెక్కింపు డిసెంబరు 11

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.