పోటీలో ప్రముఖులు

చావల్‌ బాబా... రమణ్‌సింగ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: చావల్‌బాబాగా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రజలు ఆప్యాయంగా పిలుచుకునే సీఎం రమణ్‌సింగ్‌ గత మూడు పర్యాయాలుగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం నుంచి విడిపోయి నవంబరు 1, 2000న పూర్తిస్థాయి రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్‌ ఆవిర్భవించింది. 2003లో జరిగిన ఎన్నికల్లో భాజపా ఘనవిజయం సాధించింది. భాజపా నేత రమణ్‌సింగ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 2003లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇప్పటివరకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించడం విశేషం. ఆయన అక్టోబరు 15, 1952లో విఘ్నహరణ్‌ సింగ్ ఠాకూర్‌, సుధా సింగ్‌ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన ప్రభుత్వ సైన్స్‌ కళాశాల నుంచి సామాన్యశాస్త్రంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం రాయ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీని అందుకున్నారు. కవర్దలో ప్రాక్టీస్‌ మొదలు పెట్టి ఎంతో మంది పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించారు. కేవలం ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా ఆయన నిబద్ధత, సేవాభావం, ప్రజలతో సులువుగా మమేకంకావడం లాంటి మంచి లక్షణాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌, భారతీయ జనతా పార్టీలో క్రీయశీలకంగా వ్యవహరించారు.

రాజకీయ ప్రస్థానం...
ఆయుర్వేద వైద్యుడిగా ప్రాక్టీస్‌ చేస్తున్న సందర్భంలోనే రమణ్‌సింగ్‌ భారతీయ జనసంఘ్‌లో చేరారు. అనతికాలంలోనే ముందుకు సాగుతూ 1976-77లో ఉమ్మడి రాష్ట్రంలో తను పుట్టిన కవర్దలో భారతీయ జనసంఘ్‌ యువమోర్చాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇది తన తొలి రాజకీయ విజయంగా చెప్పుకోవచ్చు. అదే ప్రాంతం నుంచి 1983లో కవర్ద మున్సిపాలిటీకి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అలా రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన రెండు సార్లు అవిభక్త మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999లో నిర్వహించిన 13వ లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. అంతేకాకుండా అప్పటి ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖకు సహాయ మంత్రిగా 2003 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన ఛత్తీస్‌గఢ్‌కి భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2003, 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయఢంకా మోగించడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి రాష్ట్ర బాధ్యతలు తన భుజాలపై వేసుకున్నారు.

ముఖ్యమైన ఘట్టాలు...
* 1990, 1993లో రెండు పర్యాయాలు అవిభక్త మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
* 1999లో నిర్వహించిన 13వ లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన ఆయన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా సేవలు అందించారు.
* ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆయన 2003, 2008, 2013 ఎన్నికల్లో గెలిచారు.
* ప్రముఖ పత్రిక ఇండియాటుడే 2005లో ప్రకటించిన ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.
* ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికై దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ట్వంటీ పాయింట్‌’ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపట్టి దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారు.
* సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ప్రగతివైపు అడుగులు వేస్తున్న రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచినందుకుగాను రాష్ట్రానికి ‘క్రిసిల్‌ రన్నర్స్‌ అప్’‌ అవార్డును అందుకున్నారు.
* ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఆర్‌ఐ అసోసియేషన్‌, ఇండో అమెరికన్‌ కమ్యూనిటీ ఆఫ్‌ నార్త్‌ అమెరికా సంయుక్తంగా 2004-05లో ‘ఔట్‌ ‌స్టాండింగ్‌ పర్సన్‌’ అవార్డుతో సత్కరించింది.
* అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె.జి.బాలకృష్ణన్‌ చేతులమీదుగా ‘భారత అస్మిత శ్రేష్ఠ జనప్రతినిధి’ అవార్డును అందుకున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

ఎన్నికల షెడ్యూల్

ఛత్తీస్‌గఢ్ నవంబరు 12 , 20
మధ్యప్రదేశ్‌ నవంబరు 28
మిజోరం నవంబరు 28
తెలంగాణ డిసెంబరు 7
రాజస్థాన్ డిసెంబరు 7
ఓట్ల లెక్కింపు డిసెంబరు 11

ఎవరేమన్నారంటే...

  • ‘మహాకూటమిలోని పార్టీలు తెజస అధ్యక్షుడు కోదండరాంను కరివేపాకులా వాడుకుని పక్కన పెట్టారు’

    - కేటీఆర్‌

  • ‘కూటమిలో టికెట్‌ తెచ్చుకోలేని కోదండరాం తెలంగాణ ప్రజలకు ఏం మేలు చేయగలరు. తెదేపా సహా వలసవాద పార్టీలను ఓడించాలని గతంలో పిలుపునిచ్చిన ఆయన నేడు చంద్రబాబుతో వేదిక ఎలా పంచుకున్నారు’

    - హరీశ్‌రావు

  • ‘రాహుల్‌ గాంధీ సీట్లు ఇవ్వొచ్చు.. చంద్రబాబు నోట్లు ఇవ్వొచ్చు.. ఓట్లు మాత్రం తెలంగాణ ప్రజలవని గుర్తుంచుకోవాలి. పొరపాటున కూటమికి ఓటేస్తే తెలంగాణ వనరులు పరాయి వాళ్ల పరమవుతాయి’

    - కేటీఆర్‌

  • ‘ మీ కారును ఎక్కడైనా నడిపించుకోండి.. కానీ రాజేంద్రనగర్‌కు మాత్రం రానివ్వకండి.. ఔటర్‌ రింగురోడ్డు మీదుగా అటునుంచి అటే వెళ్లిపోండి’

    - ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ

  • ‘ సర్వేలను చూసి అతివిశ్వాసానికి పోయే ప్రసక్తే లేదు. గతంలో సర్వేల ఫలితాలు తారుమారు అయ్యాయి. సర్వేల ఆధారంగా మేము సన్నద్ధం కావడం లేదు’

    - జ్యోతిరాదిత్య సింధియా

  • ‘మోసగించడం కాంగ్రెస్‌ రక్తంలోనే ఉంది. అబద్ధాలు చెప్పడం, ద్వంద్వవైఖరి ఆ పార్టీ నైజాం’

    - ప్రధాని మోదీ

  • © 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
    Designed & Developed by Eenadu WebHouse
    For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
    Best Viewed In Latest Browsers

    Terms & Conditions   |    Privacy Policy

    Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.