ప్రధానాంశాలు

గులాబీ రంగులోనే బ్యాలెట్‌: ఈసీ

హైదరాబాద్‌: అభ్యర్థులు నేర చరిత్రను అఫిడవిట్‌లో పొందుపరచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ పేర్కొన్నారు. నేర చరిత్రకు సంబంధించి మూడుసార్లు ప్రజాదరణ పొందిన పత్రికలు, టీవీల్లో ప్రకటించాలని సూచించారు. ప్రకటనలకు అయ్యే ఖర్చును ఎన్నికల వ్యయంలో భాగంగానే పరిగణిస్తామని స్పష్టంచేశారు. ఈ నెల 12 నోటిఫికేషన్‌ ప్రకటిస్తామని తెలిపారు. ఎన్నికల బ్యాలెట్‌ పత్రం గులాబీ రంగులోనే ఉంటుందని, ఓటరు స్లిప్‌ మాత్రం తెలుపు రంగులో ఉంటుందని ఆయన తెలిపారు. 32,574 పోలింగ్‌ కేంద్రాలు, 217 అనుబంధ పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్టు రజత్‌కుమార్‌ వివరించారు. సీఈవో దగ్గర ఫారం‌ ఏ, రిటర్నింగ్‌ అధికారి వద్ద ఫారం బి ఇవ్వాలన్నారు. పార్టీల మేనిఫెస్టో మూడు ప్రతులను సీఈవో కార్యాలయంలో అందజేయాలని సూచించారు. నేర చరిత్ర లేనివారు ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. డిసెంబర్‌ 1 వరకు అందరికీ ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటివరకు రూ.64.36 కోట్ల నగదు, 2.18 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. పట్టుబడిన మద్యం విలువ రూ.5.16 కోట్లుగా ఉంటుందన్నారు. ఇప్పటివరకు 78, 383 మందిని బైండోవర్‌ చేశామన్నారు. నాన్ ‌బెయిలబుల్‌ వారెంట్ల అమలు ఇంకా జరగాల్సి ఉందని చెప్పారు. సీ విజిల్‌ ద్వారా 1894 ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు. 1012 కేసులను పరిష్కరించామని, మిగతా వాటిని వివిధ దశల్లో డ్రాప్‌ చేశారని వెల్లడించారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాల కోసం 4462 దరఖాస్తులు, ఓటు హక్కు కోసం ఇప్పటివరకు 3,50,962 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. 1,53,115 దరఖాస్తులు ఆమోదించామని, 13,326 తిరస్కరించినట్టు చెప్పారు. ఎన్నికల సన్నద్ధత బాగా జరిగిందన్నారు. ఫిర్యాదులపై పలువురు నేతలకు నోటీసులు జారీచేశామని రజత్‌కుమార్‌ వివరించారు.

మరిన్ని