ప్రధానాంశాలు

మాయావతి పీఎం.. నేను సీఎం
ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం అజిత్‌ జోగి

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో తానే కింగ్‌ మేకర్‌ అని మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి భావిస్తున్నారు. కాంగ్రెస్‌ను వీడి జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌(జేసీసీ) అనే పార్టీని స్థాపించిన జోగి‌.. రానున్న అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తన పాత్ర కీలకంగా ఉంటుందని నమ్మకంగా ఉన్నారు. అయితే జోగి ఇప్పుడు బీఎస్పీ, వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. ‘బహుజన్‌ సమాజ్‌ పార్టీ, వామపక్షాలతో కూటమి ఏర్పాటు చేశాం. నేను ముఖ్యమంత్రి అవుతానో లేదో ఈ కూటమి నిర్ణయిస్తుంది’ అని అజిత్‌ జోగి పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి పదవికి బీఎస్పీ అధినేత్రి మాయావతి సరిపోతారని జోగి అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్సేతర, భాజపాయేతర కూటమి మెజార్టీ సాధిస్తుందని తాను గట్టిగా నమ్ముతున్నానని వెల్లడించారు. అప్పుడు ప్రధాని పదవికి మాయావతి సరిపోతారని తాను వ్యక్తిగతంగా నమ్ముతున్నానని తెలిపారు. దళిత మహిళగా, ఉత్తరప్రదేశ్‌ రాజకీయ నాయకురాలిగా, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆమె ప్రధాని పదవికి తగిన వ్యక్తి అని జోగి అభిప్రాయపడ్డారు. 2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ విడిపోయిన తర్వాత ఆయన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. జోగి ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారిగా కూడా పనిచేశారు. 1986లో రాజ్యసభకు ఎంపికయ్యారు. కాంగ్రెస్‌లో దాదాపు మూడు దశాబ్దాల పాటు పనిచేసిన అనంతరం పార్టీ తనను పక్కన పెడుతోందని 2016లో కాంగ్రెస్‌ను వీడి సొంతగా పార్టీ పెట్టుకున్నారు.

మరిన్ని