ప్రధానాంశాలు

మీరు లైన్లలో నిలబడితే.. వాళ్లు డబ్బుతో పారిపోయారు
మోదీ ప్రభుత్వంపై రాహుల్‌ విమర్శలు

కంకేర్‌: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌, భాజపాల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రధాని మోదీ కూడా ఈరోజే ప్రచారం చేస్తున్నారు. రాహుల్‌ రెండు రోజుల పాటు రాష్ట్రంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈరోజు కంకేర్‌ జిల్లాలోని కఖన్‌జోరె పట్టణంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో రాహుల్‌ ప్రచారం మొదలుపెట్టారు. పెద్దనోట్ల రద్దు గురించి, దేశం విడిచి పారిపోతున్న ఆర్థిక నేరగాళ్ల గురించి ధ్వజమెత్తారు. ‘పెద్ద నోట్ల రద్దు సమయంలో మీరంతా డబ్బు జమ చేసేందుకు, తీసుకునేందుకు బ్యాంకుల ముందు లైన్లలో నిలబడ్డారు, మరోవైపు నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యా, లలిత్‌ మోదీ, మెహుల్‌ ఛోక్సీ లాంటి వాళ్లు మీ డబ్బు తీసుకుని విదేశాలకు పారిపోయారు’ అని రాహుల్‌ ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు జరిగి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో రాహుల్‌ ఈ విషయంపై మరోసారి విమర్శలకు దిగారు.

రాహుల్‌ శనివారం మరో నాలుగు చోట్ల ప్రచారం చేయనున్నారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో ప్రచారం చేస్తున్నారు. రాహుల్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ నియోజకవర్గమైన రాజ్‌నంద్‌గావ్‌, చరమా, కొండగావ్‌ ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ ఎన్నికలకు రేపటితో ప్రచారం ముగియనుంది. తొలిదశ పోలింగ్‌ నవంబరు 12న 18 నియోజకవర్గాల్లో జరగనుంది. ఈ దశలోనే నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 18 నియోజకవర్గాల్లో భాజపా 12 చోట్ల ఓడిపోయింది. మిగతా 72స్థానాలకు రెండో దశలో నవంబరు 20న పోలింగ్‌ జరగనుంది. 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీలో 2013లో భాజపాకు 49సీట్లు, కాంగ్రెస్‌కు 39సీట్లు దక్కాయి. బీఎస్పీకి నుంచి ఒకరు, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.

మరిన్ని