ప్రధానాంశాలు

ఎందుకీ గందరగోళం.. త్వరగా తేల్చండి!
కాంగ్రెస్‌కు తెజస, సీపీఐ డిమాండ్‌

హైదరాబాద్‌: సీట్ల కేటాయింపు అంశంపై త్వరగా తేల్చాలని, గందరగోళానికి తావివ్వొద్దని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి కాంగ్రెస్‌కు సూచించారు. కాంగ్రెస్‌ మూడు సీట్లు ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న సీపీఐ కూటమిలో కొనసాగే విషయమై భాగస్వామ్య పక్షాలతో చర్చిస్తోంది. ఇందులో భాగంగా తొలుత తెజస అధ్యక్షుడు కోదండరామ్‌, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు రమణతో సీపీఐ నేతలు సమావేశమ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. సీట్ల సర్దుబాటులో తలెత్తిన గందరగోళాన్ని కాంగ్రెస్‌ త్వరగా పరిష్కరించాలని కోరారు. ప్రతి రాజకీయ పార్టీ కొన్ని సీట్లు అడుగుతుందని, వాటి విషయంలో చర్చించి తొందరిగా పరిష్కరిస్తే పొత్తులు బలంగా ముందుకు సాగుతాయని చెప్పారు. సీపీఐ న్యాయసమ్మతమైన సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. తమకు కేటాయించిన ఎనిమిది సీట్లు సంఖ్యాపరంగా స్పష్టత ఉన్నప్పటికీ.. అవేమిటో ఇంకా స్పష్టతలేదన్నారు.

ఐదు సీట్లు కేటాయించాల్సిందే: సీపీఐ

తాము ప్రతిపాదించిన తొమ్మిది సీట్లలో కచ్చితంగా ఐదు సీట్లు కేటాయించాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ సాయంత్రం 6గంటలకు సీపీఐ రాష్ట్ర కార్యవర్గం మరోసారి భేటీ కానుందన్నారు. సీట్ల కేటాయింపును ఏకపక్షంగా చేశారని, సంప్రదింపులు కూడా సరిగా చేయలేదన్నారు. తమకు బలం ఉన్న సీట్లు ఇవ్వలేదనే విషయాన్ని కోదండరాం దృష్టికి తీసుకెళ్లామన్నారు. కూటమికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించినట్టు చెప్పారు.

మరిన్ని