ప్రధానాంశాలు

ఎన్టీఆర్‌ కంటే కేసీఆర్‌ గొప్పేం కాదు: జానారెడ్డి

హైదరాబాద్‌: మహా కూటమి తరఫున ఏ స్థానంలో ఎవరు పోటీచేస్తారనే అంశం ఇంకా ఖరారు కాలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి అన్నారు. మిత్రపక్షాలతో కాంగ్రెస్‌ అధిష్ఠానం చర్చలు జరుపుతోందని చెప్పారు. నోటిఫికేషన్‌ నాటికి అంతా సర్దుకుంటుందన్న ఆయన సీట్ల సర్దుబాటు, ప్రచారంపై కేసీఆర్‌తో తాము పోల్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. శుక్రవారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై ఈ రోజు స్పష్టత వస్తుందనుకున్నామని, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి దుబయిలో ఉన్నందున రేపు స్పష్టత వస్తుందని స్పష్టంచేశారు. పొన్నాల లక్ష్మయ్యకు సీటు ఇవ్వమని ఎక్కడా చెప్పలేదన్నారు. పొత్తు కావాలనుకున్నప్పుడు కొన్నిత్యాగాలు చేయాల్సి ఉంటుందని, గతంలో బీసీలకు తాము 32 సీట్లు ఇచ్చామని చెప్పారు. గతంలో కంటే తక్కువ కాకుండా బీసీలకు టికెట్లు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. సీట్ల సర్దుబాటు అంశాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జి కుంతియా చూస్తున్నారన్నారు. సీట్లు ఒకట్రెండు పెరగొచ్చు, తగ్గొచ్చని, పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తమతో కలిసి వస్తున్నారని, దేశ అవసరాల కోసమే ఆయన కలిశారని స్పష్టంచేశారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరిట కేసీఆర్‌ ఇతర రాష్ట్రాలకువెళ్ల లేదా?.. దిల్లీలో మేం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిస్తే తప్పంటని ప్రశ్నించారు.

నిర్ణయాలు లేటైనా గెలుపు మాదే

కేసీఆర్‌ను ఓడించి ప్రజలే రికార్డు బ్రేక్‌ చేస్తారని జానారెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ కంటే కేసీఆర్‌ గొప్పేమీకాదన్నారు. కేసీఆర్‌ అప్పులు చేసి అభివృద్ధి అంటున్నారని మండిపడ్డారు. నిర్ణయాలు ఆలస్యమైనా గెలుపు మాత్రం తమదేనని ధీమా వ్యక్తంచేశారు. గెలిచేవారే మిర్యాలగూడ అభ్యర్థిగా ఉండాలనేది తన అభిప్రాయమన్నారు. తాను లేదా తన కుమారుడు పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని తెలిపారు. అధిష్ఠానం ఒప్పుకుంటే తన కుమారుడు పోటీ చేస్తారని తెలిపారు. 2014లో కేసీఆర్‌ మాటల గారడితో గెలిస్తే ఇప్పుడు మూటలతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. అశావహుల్లో అసంతృప్తి సహజమని, నకిరేకల్‌ స్థానంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. నకిరేకల్‌ తెలంగాణ ఇంటి పార్టీకి అంటూ కేవలం ప్రచారం మాత్రమే జరుగుతోందన్నారు.

మూడు నెలల ముందు ఎవరైనా అభ్యర్థుల్ని ప్రకటించారా?

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరాసలో ఉన్న 105 సీట్లను ప్రకటించారని, ఇంకా ఆ పార్టీకి కసరత్తు చేసే పని ఎక్కడ ఉందని జానా రెడ్డి ప్రశ్నించారు. ఈ దేశంలో మూడు నెలల ముందే ఎవరైనా అభ్యర్థుల్ని ప్రకటించారా? కారణం లేకుండా తొమ్మిది నెలల ముందు ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకు పోతామని ఎవరైనా అన్నారా? కానీ ఇలాంటి ఊహించని ఘటనలు జరుగుతున్నాయన్నారు.

దేశం కోసమే చంద్రబాబు కలిశారు

కాంగ్రెస్‌, తెదేపా కలయికపై వస్తోన్న విమర్శలకు జానారెడ్డి వివరణ ఇచ్చారు. దేశ అవసరాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబు తమతో కలిసి వస్తున్నారని తెలిపారు. చంద్రబాబుతో కేసీఆర్‌కు అవసరం ఉండి ఆనాడు కలిశారని, మరోసారి కాంగ్రెస్‌తో అవసరం ఉండి పొత్తు పెట్టుకున్నారు తప్ప తామెవరినీ కలవలేదన్నారు. దేశ అవసరాలను బట్టే పరస్పరం పొత్తులు పెట్టుకొనేందుకు ముందుకొచ్చినట్టు చెప్పారు. చంద్రబాబు రాహుల్‌ ఇంటికి వెళ్లినప్పడు తాము దిల్లీలో చంద్రబాబు ఉండే ప్రాంతానికి వెళ్లి కలిస్తే తప్పంటేన్నారు. ఆయన దిల్లీలో అందుబాటులో ఉన్నారు కాబట్టే చంద్రబాబును కలిశామని, ఆయన కోసం తామేమీ నిరీక్షించలేదని స్పష్టంచేశారు.

మరిన్ని