ప్రధానాంశాలు

కేసీఆర్‌ది గెలుపు వేగం!
తెలంగాణలో తెరాసకు సానుకూలం
ఇండియాటుడే-పీఎస్‌ఈ సర్వే
దిల్లీ: తెలంగాణాలో కేసీఆర్‌ నేతృత్వంలోని తెరాస పార్టీ అద్భుత విజయాన్ని సాధిస్తుందని ఇండియాటుడే నిర్వహిస్తున్న ‘పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి (పీఎస్‌ఈ)’ అంచనా వేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌-మేలో జరిగే లోక్‌సభ ఎన్నికల కొద్ది నెలలు ముందుగా జరుగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో 4 రాష్ట్రాల్లో ఫోన్‌ద్వారా ఓటర్లను సర్వే చేసిన పీఎస్‌ఈ.. వెల్లడైన అంశాలను రాష్ట్రాల వారీగా వివరించింది.
చౌహాన్‌కు కొంతమాత్రమే..
రాష్ట్రం: మధ్యప్రదేశ్‌
సర్వే: 29 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 11,712 మంది.
* భాజపా తిరిగి అధికారంలోకి రావడానికి 52 శాతం మాత్రమే అవకాశాలున్నాయి. ఆ పార్టీకి, ప్రత్యర్థి కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల తేడా 1 నుంచి 3 శాతం మాత్రమే ఉంటుందని అంచనా. పట్టణ ప్రాంతాల్లో భాజపా ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పోటీ తీవ్రంగా ఉంది. కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ పార్టీ లాభపడే అవకాశాలున్నాయి.
కేసీఆర్‌కే పట్టం..
రాష్ట్రం: తెలంగాణ
సర్వే: 17 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని 6,877 మంది.
* తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి 75 శాతం ఓటర్లు మద్దతిస్తున్నట్లు అంచనా. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ పాలనకు సానుకూల పవనాలు వీస్తున్నాయి. అన్నివర్గాల ప్రజల్లోనూ ఆదరణ కనిపిస్తోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సాంఘిక సంక్షేమ పథకాలు అదనపు బలం. అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కేసీఆర్‌ గొప్ప ఎత్తుగడగా నిలిచింది.
* కాంగ్రెస్‌-తెదేపాల పొత్తు సానుకూల ఫలితాలిచ్చే పరిస్థితి అంతగా కనిపించడం లేదు. హైదరాబాద్‌ ప్రాంతంలో అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం కాంగ్రెస్‌ పార్టీ ఓట్లకు గండికొట్టే అవకాశం ఉంది.
వసుంధరపై వ్యతిరేకత..
రాష్ట్రం: రాజస్థాన్‌
సర్వే: 25 పార్లమెంటరీ స్థానాల పరిధిలో 10,136 మంది. 
* ముఖ్యమంత్రిగా వసుంధరాజే వైపు 35 శాతం మంది మాత్రమే మొగ్గు చూపుతున్నారు. అధికార భాజపా కంటే కాంగ్రెస్‌ పరిస్థితి మెరుగ్గా కనిపిస్తోంది. 
* వసుంధర రాజె ప్రభుత్వంపై గట్టి వ్యతిరేకత కనిపిస్తున్నప్పటికీ ప్రధానిగా మోదీకి ఎక్కువ ప్రజాదరణ ఉంది. భాజపా సీఎం అభ్యర్థిని మారిస్తే కొంత సానుకూల ఫలితాలు ఉండే అవకాశం ఉంది. భాజపా, కాంగ్రెస్‌లకు వచ్చే ఓట్లలో తేడా 3-5 శాతం ఉండే అవకాశం ఉంది.
రమణ్‌సింగ్‌కు అనుకూలమే..
రాష్ట్రం: ఛత్తీస్‌గఢ్‌
సర్వే: 11 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 4,486 మంది.
* ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్‌ మరోసారి అధికారంలోకి రావడానికి 55 శాతం అవకాశాలున్నాయి. అజిత్‌ జోగికి చెందిన జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌, బీఎస్పీల పొత్తు అధికార భాజపాకే లాభించేలా ఉంది. ఈ కూటమి 7శాతం ఓట్లపై ప్రభావం చూపుతుందని అంచనా.
* నక్సల్స్‌ ప్రభావిత బస్తర్‌ ప్రాంతంలో మాత్రం భాజపాకు ప్రజాదరణ తగ్గినట్లు అంచనా.

మరిన్ని