ప్రధానాంశాలు

జనగామ నుంచి కోదండరాం
బరిలోకి దిగనున్న తెజస అధినేత
ఆయనే ఎన్నికల ప్రణాళిక కమిటీ ఉమ్మడి సారథి!
8 స్థానాలను సర్దుబాటు చేసిన కాంగ్రెస్‌
మరో సీటు కోసం యత్నాలు
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ జనసమితి(తెజస)అధినేత ఈ ఎన్నికల్లో ఎక్కణ్నుంచి పోటీ చేయనున్నారనే ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో తెజస ఎన్ని స్థానాల్లో బరిలోకి దిగనుందో తేలిపోయింది. రాష్ట్రంలో మొత్తం 8 స్థానాలను తెజసకు సర్దుబాటు చేస్తున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని దిల్లీలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా అధికారికంగా ప్రకటించగా.. కనీసం మరో సీటును తమకు కేటాయించాలని తెజస పట్టుబడుతోంది. తాము కాంగ్రెస్‌కు 12 స్థానాల జాబితా ఇచ్చామనీ, తమ పార్టీకి కేటాయించిన 8 సీట్లు తాము కోరుకున్నవే ఇవ్వాలని తెజస అధ్యక్షుడు కోదండరాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో 8 స్థానాల్లో తెజస అభ్యర్థులు బరిలోకి దిగనుండగా.. పార్టీ అధినేత కోదండరాం జనగామ నుంచి పోటీ చేయనున్నారు. మహాకూటమి ప్రచారం, ఎన్నికల ప్రణాళిక కమిటీకి సారథ్యం.. తదితర అంశాలపై శుక్ర, శనివారాల్లో ఉమ్మడిగా ప్రకటించే అవకాశముంది. ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక కమిటీకి సారధిగా కోదండరాంను ప్రకటించనున్నట్లు సమాచారం.

తెజసకు కేటాయించిన స్థానాలివి
1.జనగామ(కోదండరాం) 2.మెదక్‌(జనార్దనరెడ్డి) 3.దుబ్బాక(రాజ్‌కుమార్‌) 4.సిద్దిపేట(భవాని) 5.మల్కాజిగిరి(కపిలవాయి దిలీప్‌కుమార్‌) 6.మహబూబ్‌నగర్‌(రాజేందర్‌రెడ్డి) 7.వర్ధన్నపేట(అభ్యర్థి ఖరారు కాలేదు) 8.మేడ్చల్‌(హరివర్ధన్‌రెడ్డి). ఈ స్థానాల్లో ఆయా అభ్యర్థులను పోటీలో దించనున్నట్లు తెలిసింది.
* తెజసఅధినేత తమ జాబితాను దిల్లీలో కాంగ్రెస్‌కు అందజేయగా.. ఆ జాబితాలో ఉన్న వరంగల్‌ తూర్పు స్థానంపైనే చివరి వరకూ చర్చ జరిగింది.
* వరంగల్‌ తూర్పు స్థానాన్ని ఇన్నయ్య కోసం తెజస పట్టుబట్టగా.. ఇక్కడ తెదేపాకు సర్దుబాటు చేసినట్లు సమాచారం. ఈ స్థానంలో రేవూరి ప్రకాశ్‌రెడ్డిని రంగంలోకి దింపాలని తెదేపా గట్టిగా కోరడంతో కాంగ్రెస్‌ అంగీకరించినట్లు తెలిసింది.
* వరంగల్‌ పశ్చిమ స్థానాన్ని తెదేపాకు కేటాయించి, తమకు వరంగల్‌ తూర్పును కేటాయించాలని తెజస కోరగా.. జిల్లా కేంద్రంలో ఒక స్థానం కూడా తమకు లేకుండా ఉండటం సరికాదని కాంగ్రెస్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. వరంగల్‌లో సోనియా లేదా రాహుల్‌తో భారీ సభను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. జనగామ నుంచి కోదండరాం బరిలోకి దిగనున్న నేపథ్యంలో, గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్‌ నాయకుడు పొన్నాల లక్ష్మయ్యను వరంగల్‌ పశ్చిమ నుంచి బరిలోకి దించనున్నట్లు తెలిసింది.
* వరంగల్‌ తూర్పు దక్కకుంటే మిర్యాలగూడ, షాద్‌నగర్‌లలో ఒకటి తమకు 9వ స్థానంగా కేటాయించాలని తెజస కోరినట్లు తెలిసింది.

కోరుకున్నా దక్కనివి ఇవీ
తెజస తొలి నుంచి పట్టుబడుతున్న స్థానాల్లో చాలా వరకూ కాంగ్రెస్‌ సర్దుబాటు చేయలేదు. పొత్తుల్లో భాగంగా 8 సీట్లనే కేటాయించడంతో కనీసం 12-15 సీట్లు వస్తాయని ఆశించిన తెజస వర్గాలు నిరాశకు గురయ్యాయి. కేటాయించిన సీట్లు సహా ప్రధానంగా మిర్యాలగూడ, ఎల్లారెడ్డి, నిజామాబాద్‌ పట్టణం, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌, చెన్నూరు, స్టేషన్‌ ఘన్‌పూర్‌, షాద్‌నగర్‌, ఆలేరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు చేసినా ఇవి తెజసకు దక్కలేదు. ఇందులో స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి చింతా స్వామి గట్టిగా ప్రయత్నించినా సీటు రాకపోవడంతో ఇక్కడ స్నేహపూర్వక పోటీ తప్పకపోవచ్చని తెలిసింది.

సీట్ల సంఖ్య పెంచాలి: తెజస డిమాండ్‌
ఈనాడు, హైదరాబాద్‌: మహా కూటమిలో తమ పార్టీకిచ్చే సీట్ల సంఖ్య 8 నుంచి 12కు పెంచాలని తెజస అధికార ప్రతినిధి వెదిరె యోగేశ్వరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో కాంగ్రెస్‌ పార్టీని డిమాండ్‌ చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గ తెజస పార్టీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి సామగ్రిని ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

జనగామే ఎందుకు?
కోదండరాం పోటీపై తెజసలో అంతర్గతంగానే కాదు.. ఏఐసీసీ స్థాయిలో కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. తెజస అధినేత ఏ స్థానం నుంచి పోటీ చేస్తే ఆ స్థానాన్ని ఇవ్వడానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. కోదండరాం పోటీ చేయడానికి రామగుండం లేదా జనగామ.. ఈ రెండింటిలో ఏ స్థానాన్ని కోరుకుంటారో తెజసకే వదిలేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు జనగామ స్థానాన్ని వదులుకోవడానికి చివరివరకూ అడ్డుకున్నట్లు సమాచారం. ఇది పొన్నాల నియోజకవర్గం కావడంతో.. టీపీసీసీ ఇదే విషయాన్ని చెప్పి కోదండరాంకు ఈ స్థానంలో పోటీకి ససేమిరా అన్నట్లుగా తెలిసింది. అయితే ఏఐసీసీ అగ్రనేతలు జోక్యం చేసుకోవడంతో టీపీసీసీ నేతలు వెనక్కి తగ్గినట్లు సమాచారం. కాంగ్రెస్‌ చేయించుకున్న సర్వేలు.. తెజస స్వీయ సర్వేలనూ కూడా ఈసందర్భంగా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. జనగామ జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేయాలనే ఆందోళన, ఉద్యమాల్లోనూ కోదండరాం చురుకైన పాత్ర పోషించారు. ఇదే కాకుండా కోదండరాం బంధుగణం అత్యధికులుండడం కలిసి వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని