ఓటరు
తీర్పు నేడే
ఉదయం
7 గంటలకు పోలింగ్ ప్రారంభం
ఉత్కంఠ
పోరులో కీలక ఘట్టం ఈరోజే
పార్టీలకు
ప్రతిష్ఠాత్మకం.. నేతలకు కీలకం
బరిలో
హేమాహేమీలు
సత్తా
చాటాలని చూస్తున్న స్వతంత్రులు
మల్కాజిగిరిలో
అత్యధికంగా 42 మంది అభ్యర్థులు
అత్యల్పంగా
బాన్సువాడలో ఆరుగురే బరిలో
ఈనాడు
- హైదరాబాద్
అత్యంత
కీలకమైన ఎన్నికల క్రతువు ముగింపుదశకు
చేరుకుంది. ఓటరు దేవుణ్ని ప్రసన్నం
చేసుకునేందుకు నేతలు సాగిస్తున్న
దీక్ష ఫలించే రోజు ఇది.. రాష్ట్ర
ఉజ్వల భవితను నిర్దేశించే సమయమిది.
పలు పార్టీలు..
వందలమంది అభ్యర్థులు.. రకరకాల
హామీలు.. పలురకాల వాగ్దానాలు..
వాటన్నింటినీ గమనించి.. విశ్లేషించి..
ఎవరు మంచో ఎంచి.. ఒక నిర్ణయానికి
వచ్చిన ఓటరు తన మనసులోని మాటను
ఓటుగా మార్చి ఈవీఎంలో భద్రపరిచేది
నేడే.
దేశమంతా
ఉత్కంఠగా చూస్తున్న తెలంగాణ
ఓటరు తీర్పు నేడే. 2.81 కోట్ల మంది
తమ ఓటు హక్కును శుక్రవారం వినియోగించుకోనున్నారు.
పోలీసు, ఇతర అధికారులు కలిపి
సుమారు 1.90 లక్షల మంది సిబ్బంది
పోలింగు ప్రక్రియలో భాగస్వాములు
కానున్నారు.
సెప్టెంబరు
6న అసెంబ్లీ రద్దు నాటి నుంచి
రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది.
దాదాపు మూడు నెలలపాటు రాజకీయ
రణక్షేత్రంలో నాయకులు సాగించిన
ప్రచార, వ్యూహ ప్రతివ్యూహాలను
క్షుణ్నంగా గమనించిన ఓటర్లు
ఈరోజు తీర్పును నమోదు చేయనున్నారు.
వారుఎలాంటి తీర్పు ఇచ్చారన్నది
తేలాలంటే మంగళవారం జరిగే ఓట్ల
లెక్కింపు వరకు వేచి ఉండాల్సిందే.
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను
1,821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని
పరీక్షించుకోనున్నారు. ఈవీఎం,
వీవీపీఏటీ, ఓటర్ల జాబితా తదితర
సరంజామా అంతా గురువారం సాయంత్రానికే
ఆయా పోలింగు కేంద్రాలకు చేరాయి.
ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం
విస్తృత స్థాయిలో ఏర్పాట్లు
చేసింది. తీవ్రవాద ప్రభావితమున్న
13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో
విస్తృత స్థాయిలో పోలీసు బలగాలను
మోహరించింది.
ప్రచారంలో
ఎవరి వ్యూహం వారిది
గత ఎన్నికల్లో
63 సీట్లను సాధించి అధికారాన్ని
దక్కించుకుని మరోసారి దానిని
నిలుపుకోవాలని చూస్తున్న తెరాసకు
ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకం.
ఉప ఎన్నికల్లో గెలిచిన స్థానాలతో
పాటు ఇతర పార్టీల నుంచి చేరిన
ఎమ్మెల్యేలతో రద్దయ్యే నాటికి
శాసనసభలో తెరాస తన బలాన్ని 86కు
పెంచుకుంది. అన్ని పార్టీలకంటే
ముందే అభ్యర్థులను ప్రకటించి
దాదాపు 3 నెలలపాటు ప్రచారం సాగించింది.
నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి
పనులు, చేపట్టిన సంక్షేమ పథకాలతోపాటు
మరికొన్ని కొత్త హామీలతో ప్రచారాన్ని
కొనసాగించింది. ఆ పార్టీ తొలిసారిగా
రాష్ట్రంలోని 119 స్థానాలకు పోటీ
చేస్తోంది.
* తెలంగాణలో
నేతల వలసలతో ఉనికి కోల్పోయిన
దశ నుంచి బయటపడాలని చూస్తూ..
అందుకోసం ఒకప్పటి బద్ధశత్రువైన
కాంగ్రెస్‌తో తెదేపా జట్టుకట్టడం
ఈ ఎన్నికల్లో ఒక ప్రత్యేక అంశం.
* కాంగ్రెస్,
తెలుగుదేశం, తెలంగాణ జన సమితి,
సీపీఐ కలసి ప్రజాకూటమిగా బరిలో
నిలిచాయి. తెరాస ప్రభుత్వం ఎన్నికల
హామీలను నెరవేర్చలేదనే అంశంతో
పాటు రైతు రుణాల రద్దు, ఇళ్ల
నిర్మాణానికి రూ. 5 లక్షల పంపిణీ
వంటి హామీలతో ప్రచారాన్ని సాగించాయి.
పొత్తులో భాగంగా కాంగ్రెస్
99 స్థానాలకు, తెదేపా 13 స్థానాలకు,
తెజస 8, సీపీఐ 3 స్థానాలకు పోటీ
చేస్తున్నాయి.
* భాజపా
ఈసారి 118 స్థానాలకు పోటీ చేస్తోంది.
సీపీఎం సారథ్యంలోని బీఎల్ఎఫ్
119 స్థానాలకు బరిలో నిలిచింది.
* ప్రధాన
పార్టీల టికెట్లు ఆశించి దక్కని
నేతల్లో కొంతమంది బీఎస్పీ తరఫున
బరిలో నిలిచి పదికిపైగా స్థానాల్లో
పోటీ పడుతున్నారు.
మల్కాజిగిరి
బరిలో 42 మంది
* ఓటు
వేసే బ్యాలెట్ యూనిట్ (ఈవీఎం)లో
16 మంది అభ్యర్థుల పేర్లు మాత్రమే
సరిపోతాయి. అందులో చివరి గుర్తు
నోటా గుర్తు ఉంటుంది. 16 మందికి
మించి అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల్లో
ఈవీఎంను అనుసంధానిస్తారు.
* రాష్ట్రంలో
అత్యధికంగా 42 మంది అభ్యర్థులు
మల్కాజిగిరి నియోజకవర్గంలో
ఉన్నారు.
* బాన్సువాడలో
అత్యల్పంగా ఆరుగురు బరిలో ఉన్నారు.
* 25
నియోజకవర్గాల్లో 15 మంది లోపు
పోటీ చేస్తున్నారు.
* 76
నియోజకవర్గాల్లో 16 నుంచి 31 మంది
ఉండగా, 16 అసెంబ్లీ సెగ్మెంట్లలో
32 కంటే ఎక్కువమంది పోటీ చేస్తున్నారు.

60 అంకె
దాటేది ఎలా?
ఓటర్ల
అభిమానాన్ని చూరగొనేందుకు
పోటాపోటీగా విస్తృత ప్రచారం
చేసిన పార్టీలు పోల్ మేనేజ్మెంట్పై
దృష్టి పెట్టాయి. 119 శాసనసభ స్థానాలకు
జరగనున్న ఎన్నికల్లో అధికార
పీఠం దక్కాలంటే 60 సీట్ల మ్యాజిక్
సంఖ్యను దాటాల్సిందే. దీనిపైనే
ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి.
తెలంగాణ ఏర్పాటయ్యాక మొదటిసారిగా
అధికారాన్ని దక్కించుకున్న
తెరాస మరో సారి మరింత ఆధిక్యంతో
విజయం సాధించాలని భావిస్తోంది.
ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన
కాంగ్రెస్.. తెలుగుదేశం, తెజస,
సీపీఐలతో కూటమిగా ఏర్పడి అధికారం
చేపట్టాలని యత్నిస్తోంది. మరోవైపు
భాజపా, ఎంఐఎం తమ సీట్ల సంఖ్యను
పెంచుకోవాలని చూస్తున్నాయి.
గత శాసనసభలో ప్రాతినిధ్యం లేని
పార్టీలు కూడా ఉనికిని చాటుకోవాలని
ప్రయత్నిస్తున్నాయి. |
ముఖ్యనేతలకు
సవాలే
ముందస్తు
ఎన్నికలతో ఓటర్ల ముందుకు వచ్చిన
ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగున్నర
ఏళ్ల పాలనపై ప్రజాతీర్పును
కోరుతున్నారు. మరోసారి ఆశీర్వదించమని
అభ్యర్థిస్తున్నారు. తెరాస
కీలక నేతలు, మంత్రులు, కేటీఆర్,
హరీశ్‌రావు, ఎంపీ కవిత ఈ ఎన్నికలను
సవాల్‌గా తీసుకున్నారు. ప్రత్యేక
రాష్ట్రాన్ని ఇచ్చినా గత ఎన్నికల్లో
ప్రధాన ప్రతిపక్షంగానే నిలిచిన
కాంగ్రెస్ పార్టీతో పాటు తెదేపా,
తెజసకు, సీపీఐకు ఎన్నికలు అత్యంత
ముఖ్యమనే చెప్పాలి. అందుకే ఏఐసీసీ
అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తెదేపా
అధినేత చంద్రబాబు ఈ ఎన్నికల
ప్రచారానికి ప్రాధాన్యమిచ్చారు.
సొంతపార్టీ పెట్టి ప్రభుత్వ
విధానాలపై ప్రత్యక్ష పోరాటానికి
దిగిన తెజస అధ్యక్షుడు కోదండరాంకు
కూడా ఈ ఎన్నికలు ముఖ్యమైనవే.
ఇక ఒంటరిగానే సత్తా చాటాలని
చూస్తున్న భాజపా విజయం కోసం
ప్రధాని నరేంద్రమోదీ, ఆ పార్టీ
జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా
సహా భాజపా ముఖ్యనేతలు, వివిధ
రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు
ప్రచారం చేశారు. |