ప్రధానాంశాలు

ఓట్ల పండుగ.. నోట్ల జాతర
పల్లెలు, పట్టణాల్లో రాత్రంతా సొమ్ము పంపిణీ
అపార్టుమెంట్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు భరోసా
పటాన్‌చెరులో కుల సంఘాల భవనాలకు స్థలాలు
మెదక్‌లో గుడి కట్టిస్తామంటూ వాగ్దానం
నర్సాపూర్‌లో గోవా పర్యటనపై హామీ
యథేచ్ఛగా సాగిన ప్రలోభాల పర్వం

అక్షరాలా అర లక్ష
ఖమ్మం నగరంలోని ఒక కుటుంబానికి 5 ఓట్లున్నాయి. వీరికి రెండు పార్టీల వారు ఒక్కో ఓటుకు రూ.5 వేలు చొప్పున ఇచ్చారు. దీంతో ఆ కుటుంబానికి రూ.25,000 + రూ.25,000.. అక్షరాలా అర లక్ష రూపాయలు ముట్టినట్లయింది. ఇదే విధంగా పలు కాలనీల్లో ప్రలోభాల పరంపర కొనసాగింది.

ఈనాడు - హైదరాబాద్‌
రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో నగదు నాట్యం చేసింది.. మద్యం ప్రవాహమైంది.. గెలిపిస్తే నజరానాలు.. కుల సంఘాలకు ప్లాట్లు.. గుడి నిర్మాణానికి విరాళాలు.. రహదారుల మరమ్మతులు.. అపార్టుమెంట్లకు జనరేటర్లు.. సీసీ కెమెరాల ఏర్పాటు.. ఎన్నికల ప్రలోభాలలో గతాన్ని మించిన అనుభవాన్ని ఓటర్లు చవిచూశారు.. అంతేకాదు.. నాయకులు రూ.కోట్ల కొద్దీ సొమ్ము వెదజల్లారు.. ఒక్కో పార్టీ ఒక్కో కంపెనీ మద్యం సీసాలను పంచింది.. నిఘా ఉంటే కల్యాణ మండపాలను అద్దెకు తీసుకుని పూటుగా పోశారు. ఓటర్లకు పంపిణీ చేసిన వాటిల్లో ఎక్కువగా రూ.2 వేల నోట్లు ఉండటం చర్చనీయాంశమైంది. పట్టణ ప్రాంతాల్లో రూ.2 వేల నోటు మెరిసింది. గ్రామాల్లో రూ.500 నోటు ధగధగలాడింది. ఖమ్మం, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఒక్కో ఓటరుకు గరిష్ఠంగా రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకూ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూ.2 వేల నోట్లనే పంచినట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా...
* హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ నియోజకవర్గం పరిధిలో పలు అపార్టుమెంట్లలో ఓట్లను అభ్యర్థించిన ఓ పార్టీ అభ్యర్థి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. దాదాపు రూ.2-3 లక్షల వ్యయం అయ్యే కెమెరాలను ఎన్నికల అనంతరం ఏర్పాటు చేయిస్తానంటూ ఓట్లు వేయాలని కోరినట్లు తెలిసింది. ఓ అపార్టుమెంట్‌కు వెళితే రంగులు వేయించాలని కోరగా ఆయన మళ్లీ చెబుతానని వెళ్లారు. ఆ విషయం తెలిసి మరో అభ్యర్థి వచ్చి హామీ ఇచ్చారు. తర్వాత ఆ అభ్యర్థి పలు అపార్టుమెంట్లకు వెళ్లి వారి అవసరాలు తెలుసుకొని ఏర్పాట్లు చేయడం విశేషం. బహుళ అంతస్తుల భవనాల్లో వందల ఓట్లు ఉండటంతో అభ్యర్థులు అటువైపు దృష్టి సారించారు.

* నగరంతో పాటు నల్గొండ తదితర జిల్లాల్లో కొందరు అభ్యర్థులు కాలనీలు, అపార్టుమెంట్లకు జనరేటర్లు కానుకగా ఇస్తున్నారు. నగదు ఇస్తే పట్టుపడుతుందనే జాగ్రత్తతో చాకచక్యంగా జనరేటర్లను కొనుగోలు చేసి వాటి బిల్లులను అందజేస్తున్నారు.

* పటాన్‌చెరు నియోజకవర్గంలో ఓటర్లకు రూ.2 వేల వరకు పంపిణీ చేశారు. కుల సంఘాలకు భవనాలు నిర్మించుకునేందుకు సదరు సంఘం పేరిట ఓ అభ్యర్థి స్థలాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ కూడా చేసి ఇచ్చినట్లు సమాచారం. మరికొన్ని సంఘాలకు కూడా ఎన్నికల అనంతరం ఇస్తామని చెప్పి ఒక సంఘానికి రూ.10 లక్షల మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

* బీరంగూడలో ఓ రహదారి గుంతలమయంగా తయారైంది. ఇటీవల ఆ కాలనీ వాసులు ధర్నా చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఓ పార్టీ నాయకులు రూ.10 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించారు. కాలనీ ఓట్లన్నీ తమకే వేయాలంటూ వారి నుంచి హామీ తీసుకున్నారు.

* హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లోని అభ్యర్థుల్లో కొందరు సొమ్ము పంపిణీలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. కొందరిని పనుల కోసం అంటూ తీసుకెళ్తున్నారు. అపార్టుమెంట్లు తదితర భవనాల వద్ద కొద్దిసేపు పనిచేయించినట్లు చేయిస్తూ డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఓ ఇంట్లో ఫంక్షన్‌లా ఏర్పాటు చేసి మద్యం పంపిణీ చేస్తున్నారు.

* బెల్లంపల్లి, మంచిర్యాల ప్రాంతాల్లో ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగ సంఘాలకు పార్టీల నుంచి డబ్బు అందినట్లు తెలిసింది. వారు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు పంచుతామంటూ భరోసా ఇచ్చినట్లు సమాచారం.

* మెదక్‌ జిల్లాలో ఓ నియోజకవర్గానికి చెందిన అభ్యర్థి ఓ గ్రామానికి గుడి కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఎంత ఖర్చయినా తాను భరిస్తానని గ్రామస్థులకు తెలిపి ఓట్లు అభ్యర్థించినట్లు సమాచారం.

* తమకు ఓటు ఖమ్మం నియోజకవర్గంలో ఉంటే బాగుండేదని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఒక్కొక్కరికీ కనీసం రూ.2 వేలకు తక్కువ కాకుండా ఇస్తుండటమే ఇందుకు కారణం. డోర్నకల్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం కొద్దికాలం క్రితం ఖమ్మం నగరానికి బదిలీ అయింది. డోర్నకల్‌లో ఓట్లున్నాయి కదా అని భార్యాభర్తలు ఖమ్మంలో ఓటు నమోదు చేసుకోలేదు. వారి బిడ్డ మాత్రం నగరంలో తొలిసారి ఓటు పొందింది. ఆమెకు రెండు పార్టీల వారు రూ.2 వేల చొప్పున మొత్తం రూ.4 వేలు ఇచ్చారు. దంపతులిద్దరికీ డోర్నకల్‌లో ఓట్లు ఉండటంతో అక్కడ ఒక్కొక్కరికీ రూ.1300 చొప్పున(ఒక పార్టీ రూ.800, మరో పార్టీ రూ.500) అందాయి. ఖమ్మంలో ఓ కాలనీలోని అపార్టుమెంట్లలో వాచ్‌మన్లను విచారించి వివరాలు సేకరించిన ఓ పార్టీ నాయకులు ఆయా కుటుంబాలను కలిసి డబ్బు పంచినట్లు సమాచారం.

* భూపాలపల్లి నియోజకవర్గంలో ఓ ప్రధాన పార్టీ ఒక్కో ఓటుకు రూ.300 చొప్పున పంపిణీ చేస్తుండటంతో ప్రత్యర్థి రూ.500 ఇవ్వడం ప్రారంభించారు. దాంతో మొదటి అభ్యర్థి కూడా రూ.500 చొప్పున ఇవ్వడం ప్రారంభించడంతో ప్రత్యర్థి ఏకంగా రూ.1000కు పెంచారు. ఇలా ప్రలోభాలలోనూ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. పంపిణీలోనూ పార్టీలు సెంటిమెంట్‌ను పండిస్తున్నాయి. మహిళలను ఇళ్లకు పంపి బొట్టుపెట్టి ఇవ్వడం విశేషం.

* డోర్నకల్‌ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ఒక్కో ఓటుకు రూ.500 చొప్పున పంపిణీ చేయాలనుకున్నారు. ఓ పార్టీ అభ్యర్థి రూ.500 పంచడం ప్రారంభించడంతో మనం కూడా అంతే ఇస్తే పార్టీకి నష్టం జరుగుతుందని ద్వితీయ స్థాయి నేతలు అభ్యర్థిపై ఒత్తిడి పెంచారు. దాంతో మరో రూ.300 కలిపి రూ.800 చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు.

* నర్సాపూర్‌ నియోజకవర్గంలో ఓ అభ్యర్థి తను గెలిస్తే గోవా పర్యటన చేయిస్తానని యువ సంఘాలకు హామీ ఇచ్చారు. కుల సంఘాలకు భవనాలు నిర్మించేందుకు బయానాలు ఇచ్చిన అభ్యర్థులు గెలిచిన తర్వాత మిగతా నిధులు ఇస్తామని హామీ పొందారు.

* మహబూబ్‌నగర్‌ ప్రాంతంలో రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు నమ్మకమైన నేతలు, కార్యకర్తల బ్యాంకు ఖాతాలకు పంపారు. ఆన్‌లైన్‌ ఖాతా ఉన్న ఓటర్లకు వారి బ్యాంకు ఖాతాల్లో వేశారు. విద్యావంతులైన వారికి పేటీఎం ద్వారా కూడా బదిలీ చేశారు.

మరిన్ని