ప్రధానాంశాలు

పల్లెకు చేరిన ఓటరు దేవుళ్లు
ఓట్ల పండగ కోసం రాజధాని నుంచి పల్లెలకు పయనం
దారి ఖర్చులు చెల్లిస్తున్న నాయకులు
బస్సులు.. రైళ్లు కిటకిట..
ప్రైవేటు వాహనాలకు పెరిగిన గిరాకీ
అదనపు బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
కిక్కిరిసిన జాతీయ రహదారులు
ఈనాడు - హైదరాబాద్‌
తెలంగాణ పల్లెలు కళకళ్లాడుతున్నాయి.. సంక్రాంతి నెలరోజుల ముందే వచ్చినట్లు జనంతో గ్రామాలు కిక్కిరిసిపోతున్నాయి.. పండగైతే కొత్త అల్లుడు, కూతురే వస్తారు.. ఓట్ల పండక్కి మాత్రం పొట్ట చేతపట్టుకుని పట్నానికి తరలివచ్చినవారంతా మళ్లీ సొంత ఊళ్లకు చేరుతున్నారు. పండుగల వేళ ఎలా తళుకులీనుతాయో.. ఓట్ల పండగకీ గ్రామాలు అలాగే ముస్తాబయ్యాయి. పార్టీ జెండాలు.. తోరణాలు, అభ్యర్థుల  పోస్టర్లు.. ఊళ్లకు కొత్త కళను తీసుకొచ్చాయి. హైదరాబాద్‌ మాత్రం ఒక్కసారిగా బోసిపోయింది.
ధికార, ప్రజాకూటమిలో మధ్య పోటాపోటీగా ఉండటం.. ప్రతి ఓటూ కీలకమే అని భావించిన కొందరు అభ్యర్థులు హైదరాబాద్‌లో ఉంటున్న తమ నియోజకవర్గ ఓటర్లను గుర్తించి వారిన్ని రప్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. ఓటర్లను బట్టి.. బస్సులు, కార్లు, డీసీఎంలు వంటి వాహనాలను పంపించారు. మహారాష్ట్రలోని ముంబయి, భీవండి, గుజరాత్‌లోని సూరత్‌ వంటి నగరాల్లో పనిచేసుకుంటున్నవారిని కూడా  రప్పించారు. దీంతో రైళ్లు  కిటకిటలాడాయి. అదనపు రైళ్లు లేక, రిజర్వేషన్‌ దొరక్కపోవడంతో కిక్కిరిసిన జనరల్‌బోగీలో నానా ఇబ్బందులు పడి వచ్చామని చౌటుప్పల్‌కు చెందిన ఇద్దరు యువకులు ‘ఈనాడు’తో పేర్కొన్నారు. ఈసారి రద్దీ చూస్తుంటే.. ఓటేయాలన్న ఆసక్తి జనంలో బాగా కనిపించిందని, ఓటింగ్‌ శాతం గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపించాయని అధికారులు అభిప్రాయపడ్డారు.

ఓటర్లను బట్టి వాహనాలు
ప్రైవేటు పాఠశాలలకు గురువారం నుంచే సెలవులు ప్రకటించారు. శుక్రవారం పోలింగ్‌, తర్వాత రెండో శనివారం, ఆదివారం.. నాలుగు రోజులు సెలవులు కలిసి రావడంతో.. ఓటర్లు పిల్లలతో సహా సొంతూళ్లకు తరలివెళ్లారు. బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. కొంతమందైతే ఆటోలు.. వ్యాన్లు వంటి ప్రైవేటు వాహనాలను సమకూర్చుకున్నారు. కొందరు నాయకులు రవాణా ఖర్చులకు కొంత మొత్తం ఇస్తున్నారు. దీంతో బుధవారం నుంచే ప్రయాణాలు జోరందుకున్నాయి.గురువారం రాత్రికే నగరం నుంచి ఓటర్లు పెద్ద సంఖ్యలో సొంత ఊళ్లకు చేరుకున్నారు. నగరాల నుంచి వచ్చే ఓటర్ల కోసం కొన్ని గ్రామాల్లో నాయకులు భారీగా విందు భోజనాలు ఏర్పాటుచేశారు. అలాగే పాలమూరు జిల్లా నుంచి వలసపోయి ముంబయి, పుణెల్లో పనులు చేసుకునే పేదలు పెద్దఎత్తున తిరిగి ఆ జిల్లాకు చేరుకున్నారు.

దూర ప్రాంత బస్సుల్లో అదనపు ఛార్జీల మోత
ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసిన ఆర్టీసీ దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో మాత్రం అదనపు ధర వసూలు చేస్తోంది. 200 కి.మీ.కంటే ఎక్కువ దూరం ఉండే ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపితే ఛార్జీల పెంపు మామూలేనని, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలకు వెళ్లే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనంగా వసూలు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

రోడ్డు దాటలేనంత రద్దీ..
బాలానగర్‌, న్యూస్‌టుడే: మహబూబ్‌నగర్‌ జిల్లా మీదుగా వెళ్లే 44వ నంబరు జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. శుక్రవారం పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో రాజధాని నుంచి స్వగ్రామాలకు వెళ్తున్న ఓటర్ల వాహనాలతో గురువారం జాతీయ రహదారి రద్దీగా మారింది. రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద వాహనాలు భారీగా బారులుతీరాయి. వాహనాల రద్దీతో  కూడళ్ల వద్ద స్థానికులు రోడ్డు దాట‌లేని పరిస్థితి తలెత్తింది.

శ్రమజీవుల ఓటు బాట!
తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన లక్షలాది మంది ఓట్లు వేసేందుకు స్వస్థలాలకు తరలివెళ్లారు. పలు వృత్తి ఉద్యోగాలు చేసుకొనేవారితోపాటు వాచ్‌మెన్‌లు, కాలనీల్లో పనులు చేసుకునేవారూ ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా జూబ్లీ, బంజారాహిల్స్‌లతో పాటు అమీర్‌పేట, ఖైరతాబాద్‌, మాదాపూర్‌, కూకట్‌పల్లి, సనత్‌నగర్‌, ఇంకా వనస్థలిపురం, ఎల్బీనగర్‌, ఇతర ప్రాంతాల నుంచీ తరలివెళ్లడంతో ఆయా చోట్ల చాలావరకు బోసిపోయినట్లు కనిపిస్తోంది. జిల్లాలకు చెందిన నాయకుల నుంచి ఫోన్ల ద్వారా కబురు రావడం, పలుచోట్ల వాహనాలూ ఏర్పాటుచేయడంతో అంతా ఓటు బాట పట్టినట్లయింది.

మరిన్ని