ప్రధానాంశాలు

విజయ దుందుభి మోగిస్తాం
తెలంగాణ ప్రజలు సత్తా చాటుతారు
వందకుపైగా స్థానాల్లో పాగా వేస్తాం
కూటమికి ఘోర పరాజయమే
ఎన్నికలకు ముందే విచ్ఛిన్నం
ప్రకటనల్లో చంద్రబాబు ఫొటో తొలగించారు
మీ కష్టానికి తగిన ఫలం దక్కుతుంది
పార్టీ అభ్యర్థులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌
ఈనాడు - హైదరాబాద్‌
శాసనసభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్లూ పనిచేసింది ఒక ఎత్తు. ఎన్నికల రోజు కష్టపడటం ఒక ఎత్తు అని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్‌ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. గురువారం సీఎం తన నివాసం నుంచి అభ్యర్థులతో ఫోన్‌లో మాట్లాడారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన 116 మందితో ముచ్చటించారు. తెరాస విజయ దుందుభి మోగిస్తుందని తెలంగాణ ప్రజలు తమకు అనుకూలంగా మరోసారి సత్తా చాటుతారని, వందకు పైగా స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందని వారితో పేర్కొన్నట్లు సమాచారం. ప్రజాకూటమికి పరాజయం తప్పదని, ఎన్నికలకు ముందే ఆ పార్టీ విచ్ఛిన్నమైందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల సరళి గురించి, శుక్రవారం పోలింగు రోజున అనుసరించాల్సిన వ్యూహాన్ని వివరించారు. తెరాస విజయం సాధించే పరిస్థితులను వివరిస్తూ అక్కడి ఎన్నికల సర్వే ఫలితాలను, కూటమికి సంబంధించిన అంశాలను వారితో చర్చించారు.

పూర్తి సానుకూలమే
‘‘ప్రజలు తెరాస వైపే ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో సభలు విజయవంతమయ్యాయి. ప్రచారానికి స్పందన వచ్చింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం, ప్రణాళికలో లేని వాటిని కూడా ప్రకటించి అమలు చేయడంపై ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తి సానుకూలత ఉంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు కూడా మేలు చేశాయనే భావనలో ప్రజలున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలంతా ఓటమికి భయపడి వారి నియోజకవర్గాలను దాటి బయటికి రావడం లేదు. ప్రజాకూటమి ఎన్నికల్లో విఫలమైంది. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక కుట్రపూరితంగా ఆంధ్రా సీఎం చంద్రబాబుతో కుమ్మక్కైంది. తెరాసను ఎలా ఎదుర్కొనాలో తెలియలేదు. అభ్యర్థులను చివరి క్షణం వరకూ ఎంపిక చేయలేదు. తెరాసకు భయపడి అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించింది. కొన్నిచోట్ల ఇద్దరు, ముగ్గురికి బీఫారాలు ఇచ్చారు. కూటమిలో సయోధ్య లేదు. ఇక్కడి నేతలకు విలువ లేకపోవడంతో దిల్లీ నుంచి రాహుల్‌ గాంధీని, అమరావతి నుంచి చంద్రబాబును పిలిపించుకుంది. దశాబ్దాల పాటు కాంగ్రెస్‌, తెదేపాలు తెలంగాణను దగా చేశాయి. గత హామీలను అమలు చేయలేదు. ఈసారి వారి ప్రణాళికలో నమ్మలేని వాగ్దానాలున్నాయి. 2014 చేసిన వాటినే మళ్లీ వల్లె వేశారు. ఇళ్ల నిర్మాణానికి సాయం చేస్తామని చెప్పి రుణం అని బుకాయిస్తోంది. తెరాస ప్రభంజనానికి భయపడి.. గురువారం ఇచ్చిన ప్రకటనల్లో బాబు ఫొటోలను తొలగించింది. శుక్రవారం ప్రజలు సరైన తీర్పు ఇస్తారు. ప్రగతిపథంలో సాగుతున్న తెలంగాణకు ఎన్నికల ఫలితాలు గొప్ప స్ఫూర్తినిస్తాయి. పోలింగు రోజున అభ్యర్థులంతా కష్టపడాలి. పార్టీ శ్రేణులు, నేతలను కలుపుకొని వెళ్లాలి. ఉదయం నుంచి సాయంత్రం పోలింగు ముగిసే వరకూ ప్రజల్లో ఉండాలి. నిర్విరామంగా పనిచేయాలి. పోలింగు శాతం పెంచేందుకు కృషి చేయాలి. ఎన్నికల సంఘం నిబంధనలను తప్పకుండా పాటించాలి. ఎక్కడైనా వివాదాలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి.’’ అని కేసీఆర్‌ అభ్యర్థులకు సూచనలిచ్చారు.

మరిన్ని