ప్రధానాంశాలు

గెలుపు మనదే, విశ్వాసంతో వెళ్లండి
పోలింగ్‌ శాతం పెంచేలా దృష్టి సారించాలి
టీపీసీసీ నిఘానేత్రం దృష్టికి తీసుకురండి
ప్రజాకూటమి అభ్యర్థులతో ఉత్తమ్‌ టెలికాన్ఫరెన్స్‌
ఈనాడు, హైదరాబాద్‌: ‘‘తెలంగాణ ప్రజలు ప్రజా కూటమికి పూర్తి మద్దతు ఇస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు బాగా ప్రభావం చూపుతున్నట్లు స్పష్టంగా వెల్లడైంది.అభ్యర్థులు  విశ్వాసంతో ముందుకు వెళ్లాలి’’ అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.గురువారం కాంగ్రెస్‌ సహా కూటమి పార్టీల అభ్యర్థులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన పలు అంశాలు ప్రస్తావించి, కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది. పోలింగ్‌ రోజు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఉదయం నుంచే పోలింగ్‌పై పూర్తి దృష్టిసారించి పార్టీకి వచ్చే చివరి ఓటు వరకూ పోలయ్యేలా చూడాలని సూచించారు. యువత నుంచి కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ఉన్నందున వారి ఓటింగ్‌ కీలకమని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీలైన రెండు లక్షల రుణమాఫీ, నిరుద్యోగభృతి, ఉద్యోగాల భర్తీ, సీపీఎస్‌ రద్దు, పింఛన్ల పెంపుతో అన్ని వర్గాలు కూడా అనుకూలంగా ఉన్నాయన్నారు. పోలీసుల చర్యలతో ఎక్కడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దని సూచించారు. వివాదాలకు, గొడవలకు దూరంగా ఉంటూనే ఓటింగ్‌పైనే దృష్టిసారించాలన్నారు. ఇతర పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలను తీవ్రంగా ప్రతిఘటించాలన్నారు. ఇలాంటి చర్యల నేపథ్యంలో ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. డబ్బు, మద్యం పంపిణీ ఎన్నికల ఇతర అక్రమాలపై టీపీసీసీ కోశాధికారి గూడురు నారాయణరెడ్డి నేతృత్వంలోని టీపీసీసీ నిఘానేత్రం విభాగానికి తెలియజేయాలన్నారు. శుక్రవారం రాత్రివరకూ కూడా ఇది పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్‌, తెదేపా, తెజస, సీపీఐ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. వారం రోజులుగా జరిగిన ప్రచారంతో కూటమి మరింత బలోపేతమైందన్నారు. పోలింగ్‌ శాతం కీలకమని,  పోలింగ్‌ శాతం పెరిగేలా చూడాలన్నారు. బోగస్‌ ఓట్ల పట్ల ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.  ప్రచారం పూర్తయిన అనంతరం గత 24 గంటల్లో కొందరు అధికారులు, కొన్ని చోట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఎన్నికల కమిషన్‌, హైకోర్టు తీవ్రంగా పరిగణించాయని గుర్తించాలన్నారు. ఏ అంశమైనా కూడా పార్టీ ముఖ్యనేతల దృష్టికి తీసుకురావడంతోపాటు అందుబాటులోని ఎన్నికల కమిషన్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. అన్ని విధాలా ఇప్పటి వరకూ దీటుగా వ్యవహరించారని పోలింగ్‌ రోజు కూడా ఇదే పంథాను కొనసాగించాలన్నారు. బూత్‌ కమిటీల బాధ్యత అత్యంత ముఖ్యమని, ఉదయం నుంచే కమిటీలు క్రియాశీలకంగా ఉండాలని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వివరించినట్లు సమాచారం.

మరిన్ని