ప్రధానాంశాలు

తరలుతున్న నోట్ల కట్టలు
వాహన తనిఖీల్లో భారీగా దొరికిన నగదు
సర్వే సత్యనారాయణ అనుచరుడి నుంచి రూ.50 లక్షల స్వాధీనం
వరంగల్‌లో రూ.23.80 లక్షలు..
పలుచోట్ల దాడులు, తనిఖీలు
రూ.1.36 కోట్లకుపైగా పట్టుబడిన వైనం
ఈనాడు యంత్రాంగం: ఎన్నికల ఘట్టానికి కొన్ని గంటలు ముందుగా పలు పార్టీల నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు పంపిణీకి తెరతీశారు. భారీగా నగదు తరలింపు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పలు రకాలుగా తరలుతున్న డబ్బుల కట్టలను స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు, స్థానిక పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. వాహనాలతనిఖీల్లో భాగంగా సుమారు రూ.1.36 కోట్లకు పైగా కరెన్సీ దొరికింది. ఈ ఉదంతాల వివరాలివీ..

‘సర్వే’ అనుచరుడి అరెస్టు
కేంద్ర మాజీ మంత్రి, కంటోన్మెంట్‌ ప్రజాకూటమి అభ్యర్థి సర్వే సత్యనారాయణ ప్రధాన అనుచరుడు గాలిబాలాజీ వద్ద నుంచి తూర్పు మండలం టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టరు గట్టుమల్లు, బేగంబజార్‌ పోలీసుల ఆధ్వర్యంలో రూ.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి నాంపల్లి హ్యాండ్లూమ్‌ హౌస్‌ వద్ద ఇన్నోవా కారులో నగదు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దిలీప్‌ అనే హవాలా వ్యాపారి వద్ద నుంచి ఈ నగదు తీసుకుని వెళ్తున్నట్లు బాలాజీ వెల్లడించాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

* నల్గొండ జిల్లా చింతపల్లి మండలకేంద్ర సమీపంలో గురువారం వాహనాల తనిఖీలో రూ.1.97లక్షల నగదు పట్టుకున్నారు. వాహనంలో రూ.1.05 లక్షలు, మరో ముగ్గురినుంచి రూ.92 వేలు స్వాధీనం చేసుకున్నారు.

* టాటా ఏస్‌ వాహనంలో తరలిస్తున్న రూ.19.93 లక్షల నగదు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పట్టుబడింది. హైదరాబాద్‌ నుంచి మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరుకు కప్పుసాసర్లతో కూడిన అట్టపెట్టెల లోడుతో వెళ్తున్న ఈ వాహనాన్ని ఆలేరు చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేశారు. అందులో రూ.13.03 లక్షల నగదు పట్టుబడింది. డ్రైవర్‌ను ప్రశ్నించగా.. ఆలేరులోని దాబా వద్ద కొందరు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి తన వాహనాన్ని ఆపారని, వాహనంలోని అట్టపెట్టెల్లో డబ్బును పెట్టి, కిరాయిగా తనకు రూ.5 వేలు ఇచ్చారని తెలిపాడు.

* యాదగిరిగుట్టలో అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై తిరుగుతున్న రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన బి.ఆనంద్‌ వద్ద రూ.6.90 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

* కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఒక పార్టీ అభ్యర్థి గురువారం అర్ధరాత్రి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ప్రార్థన మందిరాలకు వెళ్లి ఆయా సామాజిక వర్గాల వారితో మంతనాలు చేసినట్లు సమాచారం.

* కూకట్‌పల్లిలో ఓ నాయకుడి ఇంటిపై దాడి చేసి గాయపరచడంతో పాటు, కావాలని ఇంట్లో మద్యం సీసాలు పెట్టి పోలీసులకు పట్టించిన విషయమై వివాదం చెలరేగింది.

* భువనగిరి, ఆత్మకూరు, వరంగల్‌ అర్బన్‌, భువనగిరి పురపాలక సంఘం పరిధిలో నోట్ల పంపిణీ జరిగింది. భువనగిరిలో నగదు పంపిణీ చేస్తున్న వారిని అడ్డుకుని పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు.

* నిర్మల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి ఇంటి సమీపంలో తెరాస కార్యకర్తలు సంచరిస్తుండటంతో ప్రశ్నించినందుకు కాంగ్రెస్‌ కార్యకర్త జుబేర్‌పై కత్తితో చేశారంటూ పోలీసులకు కాంగ్రెస్‌ నాయకులు ఫిర్యాదు చేశారు.

* శేరిలింగంపల్లి నియోజకవర్గం పాపిరెడ్డి కాలనీలో తెరాస, మహాకూటమి నేతల మధ్య ఘర్షణ జరిగింది. తెరాస వారు సొమ్ము పంచుతున్నారని కూటమి నేతలు ఆరోపించారు.

రోడ్డుపక్కన నోట్ల కట్టలు
వాహనాలను తనిఖీ చేస్తున్నారనే సమాచారంతో కొంతమంది పంపిణీ కోసం తరలిస్తున్న నగదును రోడ్డు పక్కన పారేసి పరారైన ఉదంతమిది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బుధవారం అర్ధరాత్రి ఈదులగూడెం కూడలిలో ఒకటో పట్టణ పోలీసులు హౌసింగ్‌బోర్డుకు చెందిన కాంగ్రెస్‌ కార్యకర్త సురేందర్‌రెడ్డి వద్ద రూ.40 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని దూరం నుంచి గుర్తించిన కొందరు తమ వాహనం నుంచి రూ.4 లక్షలు రహదారి పక్కనే పడేసి పరారయ్యారని ఒకటో పట్టణ సీఐ సదానాగరాజు తెలిపారు.
* ఓటర్లకు పంపిణీ చేసేందుకు తరలిస్తున్న రూ.23.80 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌ నగరంలోని ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు బుధవారం అర్ధరాత్రి తనిఖీ చేస్తుండగా వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన సూదుల కృష్ణారెడ్డి, దద్దు రమేష్‌ ద్విచక్ర వాహనంపై క్యారీ బ్యాగుల్లో రూ.23.80 లక్షల నగదును తరలిస్తూ దొరికిపోయారు.
* మంచిర్యాల జిల్లాకేంద్రంలో పంపిణీకి సిద్ధంగా ఉన్న రూ.12.60 లక్షల నగదును పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని 14వ వార్డుకు చెందిన తెరాస కౌన్సిలర్‌ మాదంశెట్టి రమాదేవి ఇంట్లో టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌, ఎన్నికల అధికారులు చేసిన తనిఖీల్లో ఈ నగదు దొరికింది.
డబ్బు పంచుతూ దొరికిన  ఎంపీపీ, మాజీ ఎంపీపీ
ఎన్నికల సందర్భంగా ఓటర్లకు నగదు పంచుతూ ఎంపీపీ, మాజీ ఎంపీపీ ఎస్‌ఓటీ పోలీసులకు దొరికారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో ఎంపీపీ మర్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కృపేష్‌ ఎంబీఆర్‌ నగర్‌లోని జక్క రవీందర్‌రెడ్డి ఇంటి వద్ద బీఎస్పీ అభ్యర్థి తరఫున ఓటర్లకు డబ్బులు ఇస్తుండగా ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి రూ.6.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

* మండల పరిధిలోని కర్ణంగూడ, చర్లపటేల్‌గూడ వద్ద మద్యం తరలిస్తుండగా, అయిదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. 

* యాదాద్రి జిల్లా బీబీనగర్‌-ఘట్‌కేసర్‌ సరిహద్దులో ప్రత్యేక చెక్‌పోస్టు దగ్గర భువనగిరి నుంచి నగరానికి వస్తున్న ఆర్టీసీ బస్సులో దత్తారి అనే వ్యక్తి బ్యాగులో రూ.3.04 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

* కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట జడ్పీటీసీ సభ్యుడు, కాంగ్రెస్‌ నాయకుడు అరుకాల వీరేశలింగానికి చెందిన కొత్తపల్లిలోని మిల్లులో దాచిన రూ.4.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 

* యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండల కేంద్రంలోని అనుమానిత వ్యక్తుల ఇంట్లో ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి, రూ.2.81 లక్షల నగదు, 90 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. 

* అల్వాల్‌ భూదేవినగర్‌లో ఉన్న తెరాస వార్డు కార్యాలయంలో రూ.3.5 లక్షల నగదును ప్రత్యేక నిఘా బృందం పట్టుకొంది. పార్టీ శ్రేణులు, పౌరులు పెద్దఎత్తున తరలిరావడంతో పోలీసులు కార్యాలయంపై దాడి చేసి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

* నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్‌ గ్రామంలో ఆర్‌ఎంపీ వైద్యుడు, తెరాస పార్టీ కార్యకర్త రామోజు నర్సింహాచారి ఇంట్లో రూ.5,54,300 పట్టుబడగా, ఇదే గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు పిచ్చిరెడ్డి రూ.53,700 పంచుతుండగా పోలీసులు పట్టుకున్నారు.

మరిన్ని