ప్రధానాంశాలు

సెల్‌ఫోన్లు అనుమతించం
10-12 కేంద్రాలకో సెక్టార్‌  బృందం
3,478 కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌
సీఈఓ రజత్‌కుమార్‌ వెల్లడి
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ‘ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. బాధ్యత గల పౌరులుగా అందరూ ఓటు వేయాలి. మూడు నెలలపాటు 60వేల మందిమి కష్టపడి పనిచేశాం. అందరూ ఓట్లు వేస్తేనే, మేం పడిన కష్టానికి విలువ ఉంటుంది’ అని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ అన్నారు.ఆయన గురువారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ‘‘సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన ప్రతిఒక్కరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది. అవసరమైతే రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. సెల్‌ఫోన్లు పోలింగ్‌ కేంద్రాల్లోకి తీసుకెళ్లడం నిషిద్ధం. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. వీరి వద్ద అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్లు ఉంచాం. ఎక్కడైనా ఈవీఎంలతో సమస్య ఏర్పడితే ఈ బృందం అరగంటలో వెళ్లి పరిష్కరిస్తుంది ’’అన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పటివరకు రూ.135 కోట్లు జప్తు చేశామన్నారు. ‘‘కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు 10శాతం పోలింగ్‌ కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌ నిర్వహిస్తున్నాం. 31 జిల్లాల్లో 3,478 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను నేరుగా సీఈసీ పర్యవేక్షిస్తుంది. మిగిలిన చోట్ల పోలింగ్‌ను రికార్డు చేస్తాం. వెబ్‌కాస్టింగ్‌లో పాల్గొనేందుకు తొలుత వచ్చిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఇచ్చాం. నేరుగా బ్యాలెట్‌ ఇస్తే తప్పుదారి పట్టే అవకాశం ఉన్నందున చివరిలో వచ్చినవారికి ఇవ్వడం లేదు. నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ శాతాన్ని రెండు గంటలకోసారి విడుదల చేస్తాం. కొడంగల్‌లో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తిచేశాం. ఈవీఎంలు, వీవీప్యాట్లు సరిపడా ఉన్నాయి. 1300 అదనపు కంట్రోల్‌ యూనిట్లను తీసుకొచ్చాం. 113 నియోజకవర్గాలకు ఈవీఎం, వీవీప్యాట్లు చేరుకున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అధికారులు గైర్హాజరయ్యారు. వారికి సర్దిచెప్పి ఆరు నియోజకవర్గాలకు శుక్రవారం ఉదయం 6గంటల్లోగా అధికారులను సామగ్రితో సహా పంపిస్తాం’’ అన్నారు.

కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష
అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు (కలెక్టర్లు), ఎస్పీలు, ఐజీ, డీఐజీలతో రజత్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల సంబంధిత నోడల్‌ అధికారి జితేందర్‌, ఇతర ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. సమావేశం అనంతరం జితేందర్‌ విలేకరులతో మాట్లాడుతూ... తమకు అన్ని పార్టీలూ సమానమే అని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేసినట్లు వినవస్తున్న వార్తలో నిజం లేదన్నారు.

మరిన్ని