ప్రధానాంశాలు

మధుయాస్కీని అడ్డుకున్న కొమిరెడ్డి వర్గీయులు
వాహనాలపై దాడి: అద్దాలు ధ్వంసం
మెట్‌పల్లిలో ఉద్రిక్తత
మెట్‌పల్లి, న్యూస్‌టుడే: మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాస్కీని గురువారం రాత్రి జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రామ్‌లు వర్గీయులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. నిజామాబాద్‌ నుంచి జగిత్యాలకు వెళ్తున్న మధుయాస్కీ మార్గమధ్యలో మెట్‌పల్లిలో ఆగారు. పట్టణంలోని రాజకళా మందిర్‌ థియేటర్‌ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో ఆయన కారును కొమిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ పరిణామాలతో మధుయాస్కీ వాహనాన్ని పక్కన నిలిపి సమీపంలో ఓ నాయకుడి ఇంట్లోకి వెళ్లి వచ్చే లోపు ఆందోళనకారులు ఆయన కారు అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న కాంగ్రెస్‌ నాయకుడు జువ్వాడి కృష్ణారావు, ఆయన అనుచరులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఇదిలా ఉండగా మధుయాస్కీ డబ్బులు పంపిణీ చేస్తుండగా తాము అడ్డుకున్నామని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కొమిరెడ్డి వర్గీయులు, తెరాస నాయకులు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఘటనపై మధుయాస్కీ స్పందించారు. కాంగ్రెస్‌ టికెట్‌ రాలేదన్న అక్కసుతో కొమిరెడ్డి రామ్‌లు, తెరాస నాయకులతో కలిసి తనపై దాడికి  పాల్పడినట్టు పేర్కొన్నారు. ఎంపీ కవిత ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలను భయభ్రాంతులకు గురి చేయడమే వారి వ్యూహమని తెలిపారు.

మరిన్ని